Donald Trump: ట్రంప్ ఎఫెక్ట్.. పార్ట్ టైమ్ ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు

Indian students quitting part time jobs in US over Trumps deportation threats
  • క్లాసులు లేనప్పుడు అనధికారికంగా పనిచేస్తున్న విద్యార్థులు
  • ఖర్చులు భరించాలంటే ఏదో ఒక పనిచేయక తప్పదని వెల్లడి
  • ఇమిగ్రేషన్ తనిఖీల భయంతో పార్ట్ టైమ్ జాబ్స్ వదిలేస్తున్నట్లు వివరణ
ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావొద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేస్తున్నామని అగ్రరాజ్యంలోని మన విద్యార్థులు చెబుతున్నారు. నెలవారీగా అయ్యే ఖర్చుల కోసం పార్ట్ టైమ్ పై ఆధారపడతామని తెలిపారు. క్లాసులు అయిపోయాక ఎక్కడో ఓ చోట పనిచేయకుంటే ఇక్కడ బతకలేమని వివరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన స్టూడెంట్లలో చాలామంది పార్ట్ టైమ్ చేస్తున్నారని సమాచారం. అయితే, ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు.

చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. అయితే, వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు. దీంతో చాలామంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంక్ లు తదితర వాటిలో పార్ట్ టైమ్ చేస్తుంటారు. విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు.

ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది. దీంతో చాలామంది తమ పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దవుతుందనే ఆందోళనతో ముందుజాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్నతవిద్య కోసం దాదాపు 50 వేల డాలర్లు (రూ.42 లక్షలకు పైగా) ఖర్చయిందని, ఇప్పుడు వీసా రద్దయి ఇండియాకు వెళ్లాల్సివస్తే ఆ అప్పు తీర్చే మార్గమే ఉండదని ఓ విద్యార్థి వాపోయాడు. ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశాక వలస విధానంలో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడని వివరించారు.
Donald Trump
Indian Students
F1 Visa
Immigration laws
USA
Part time jobs

More Telugu News