Wipro: హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ.. దావోస్ వేదికగా ప్రకటన

Wipro to expand its services in Telangana
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న విప్రో
  • ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు
  • రెండు, మూడేళ్లలో పూర్తి కానున్న కొత్త విప్రో సెంటర్
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం విప్రో నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది. 

మరోవైపు, హైదరాబాద్ లో విప్రో విస్తరణ నిర్ణయాన్ని రేవంత్ స్వాగతించారు. విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలకు అనువైన వాతావరణం కల్పించేందుకు, తగిన మద్దతు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విప్రో విస్తరణతో తెలంగాణలో ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుందని అన్నారు. కొత్త విప్రో సెంటర్ రాబోయే రెండు, మూడేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్ర ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు. 

విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ మాట్లాడుతూ... కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... స్కిల్ ఇండియా యూనివర్శిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని విప్రోను కోరారు.
Wipro
Hyderabad
Revanth Reddy
Congress

More Telugu News