telangana medical council: హైదరాబాదులో కిడ్నీ రాకెట్ కలకలం... తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫైర్

the telangana medical council is angry about the kidney racket
  • అలకనంద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు 
  • సూమోటోగా స్వీకరించి విచారణ చేస్తామన్న మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్
  • బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటన  
హైదరాబాద్ సరూర్‌నగర్ డివిజన్ లోని అలకనంద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు రోగులను పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. 

ఈ అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన అలకనంద ఆసుపత్రి వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ ఫైర్ అయ్యారు. 
 
మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ స్పందిస్తూ .. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కి న్యాయస్థానాన్ని పోలి ఉండే అధికారాలు ఉన్నాయన్నారు. అక్రమ కిడ్నీ మార్పిడి కుంభకోణంలో ఉన్న వైద్యులపై ప్రభుత్వ, పోలీస్ సహకారంతో ఎథికల్, మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చేయడం, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, నకిలీ వైద్యులను ప్రోత్సహించడం చట్ట విరుద్ధమైన చర్యలన్నారు. అందుకు బాధ్యులు అయిన వైద్యులను అవసరం అయితే శాశ్వతంగా మెడికల్ కౌన్సిల్ నుంచి తొలగిస్తామని తెలిపారు. 
telangana medical council
kidney racket
alakananda Hospital

More Telugu News