Etela Rajender: ఇదీ జరిగింది!: రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను కొట్టడంపై ఈటల రాజేందర్ ఏం చెప్పారంటే?

Etala Rajender reveals why he slapped real estate broker
  • ఎందుకు కొట్టవలసి వచ్చిందో చెప్పిన ఈటల రాజేందర్
  • సామాన్య ఉద్యోగుల భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
  • రౌడీలు, కుక్కలతో ప్లాట్ల యజమానులను రియల్ ఎస్టేట్ వ్యాపారి బెదిరిస్తున్నాడని ఆరోపణ
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొట్టడంపై మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. అతనిని ఎందుకు కొట్టవలసి వచ్చిందో వెల్లడించారు. ఇదే సమయంలో ఆయన అక్కడి ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలపై కూడా స్పందించారు. ఏకశిలా నగర్‌లో 2,076 మంది పేదల ప్లాట్లు కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెములలో 1985లో 149 ఎకరాలు భూమిని లేఔట్ చేసి 2,076 మందికి విక్రయించారని, కొన్న వారిలో ఎక్కువమంది చిన్న ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులేనని, వారు బ్యాంకు లోన్ తీసి మరీ కొనుగోలు చేశారన్నారు. 

అయితే, 2006లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ లేఔట్ భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని, ప్లాట్లు కొన్నవారు కోర్టుకు వెళితే కొనుగోలు చేసిన వారికి అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. 2011లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇదే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. అధికారులను మేనేజ్ చేసి మరోసారి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేశాడన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మళ్లీ కోర్టుకు వెళితే వారికి అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు.

కానీ, ధరణి వచ్చాక నాటి మేడ్చల్ కలెక్టర్‌ను పట్టుకొని తొమ్మిది ఎకరాల భూమిని రాయించుకున్నారని ఆరోపించారు. ఆ పక్కనే ఉన్న ఏకశిలా పార్క్‌లోని కొన్ని ప్లాట్లను దౌర్జన్యంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఏకశిలా నగర్‌లో ప్రస్తుతం 700 ఇళ్లు ఉన్నాయని, ప్లాట్లు ఉన్న మిగిలిన వారు ఇళ్లు కట్టుకునే ప్రయత్నాలు చేస్తే... అధికారులు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పైగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గూండాలను పెట్టుకొని, కుక్కలను పెట్టి ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలను ఇష్టం వచ్చినట్లు తిడుతూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. వారి బెదిరింపుల కారణంగా బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తే... వాళ్లు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకే అండగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను పేద ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానన్నారు. రాచకొండ సీపీకి ఫోన్ చేసి స్థానిక పోలీసుల తీరును వివరించినట్లు చెప్పారు. కబ్జాల అంశంపై కలెక్టర్‌కు కూడా ఫోన్ చేసి చెప్పానన్నారు.

ఎంపీ వచ్చి ఏం చేస్తాడని కబ్జాదారుడు ఓ మహిళతో అనుచితంగా మాట్లాడాడని మండిపడ్డారు. ప్లాట్లు ఉన్న ప్రాంతాన్ని చూడాలని బాధితులు చెబితే తాను అక్కడకు వెళ్లానని... ఇరవై మంది రౌడీలు బీర్లు తాగుతూ కనిపించారని, వారి వద్దకు వెళ్లానని, వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి చేయి చేసుకున్నట్లు చెప్పారు.
Etela Rajender
BJP
Telangana
Medchal Malkajgiri District

More Telugu News