EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక యాజమాన్యాలతో పనిలేకుండానే అకౌంట్ ట్రాన్స్‌ఫర్

Employees can now transfer their EPF account to a new employer on their own
  • ఖాతాల బదిలీ, వ్యక్తిగత వివరాల్లో మార్పులపై ఖాతాదారుల ఇబ్బందులు
  • ఇకపై ఎవరికి వారే ఆన్‌లైన్‌లో ఖాతా బదిలీ, వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం
  • ఇప్పటికే పలు మార్పులు తీసుకొచ్చిన ఈపీఎఫ్‌వో
  • కంపెనీల చుట్టూ తిరిగే బాధను తప్పించిన ఈపీఎఫ్‌వో
కారణం ఏదైనా చాలామంది కార్మికులు ఈపీఎఫ్ ఖాతాల విషయంలో తమ పూర్వ, ప్రస్తుత యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఖాతాల బదిలీ, కంపెనీని విడిచిపెట్టిన తేదీ వెయ్యడం, ఖాతాలో వ్యక్తిగత వివరాల్లో మార్పు చేర్పులు వంటి వాటిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగులను ఇలాంటి సమస్యల నుంచి బయటపడేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పలు మార్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలుమార్పులు తీసుకొచ్చి ఉద్యోగుల వెతలు తీర్చింది. తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఖాతాల బదిలీని మరింత సరళతరం చేసింది. యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటును నిన్నటి (శనివారం) నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా యాజమాన్యాల చుట్టూ తిరగడం, సమయం వృథా కావడం తప్పుతుంది. అయితే, ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జారీ అయిన యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్)‌తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. 

వ్యక్తిగత వివరాల్లో మార్పులు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకుని, ఆన్‌లైన్‌లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, 2017కు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు. షరా మామూలుగానే వారి యాజమాన్యాలే ఈ పని చేయాల్సి ఉంటుంది. 
EPFO
EPF Account Transfer
Employees
Employer

More Telugu News