Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి... స్పందించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

Serilingampalli MLA responds on Nara Lokesh comments on NTR ghat
  • ఘాట్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి వివరాలు తీసుకున్నానన్న ఎమ్మెల్యే
  • ఘాట్ నిర్వహణ లోపాన్ని ఖండించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
  • ఘాట్ నిర్వహణ బాధ్యతలు తీసుకొని సీఎం దృష్టికి తీసుకు వెళతానని వెల్లడి
  • వెంటనే మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపట్టేలా కృషి చేస్తానని హామీ
ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, హైదరాబాద్ నగర పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పందించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించేందుకు లోకేశ్ వచ్చారు. ఈ సమయంలో ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, లైట్లు విరిగిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని లోకేశ్ నిర్ణయించారు.

ఈ క్రమంలో అరికెపూడి గాంధీ స్పందించారు. ఘాట్ నిర్వహణ లోపాన్ని ఖండిస్తూనే... బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఈరోజు అన్న గారి కుటుంబ సభ్యులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విషయం హెచ్ఎండీఏ అధికారులతో మాట్లాడి సమాచారం తీసుకున్నానని అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. అన్నగారి (ఎన్టీఆర్) ఘాట్ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్యే ఖండించారు.

ఘాట్‌ నిర్వహణ బాధ్యతలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయని, కాబట్టి తానే స్వయంగా బాధ్యత తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళతానన్నారు. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు, సుందరీకరణ పనులు వెంటనే చేపట్టేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్న గారి జయంతి, వర్ధంతి వేడుకలు చేపట్టేలా పూర్తి బాధ్యత తీసుకుంటానని కూడా తెలిపారు.
Nara Lokesh
NTR
Telangana
Hyderabad
Arikepudi Gandhi

More Telugu News