Nara Lokesh: యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ దావోస్ టూర్!

Minister Nara Lokesh to attend World Economic Forum in Davos
  • ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు మంత్రి లోకేశ్‌
  • ఐదు రోజుల పర్యటనలో 50 మందికిపైగా ప్రముఖులతో సమావేశాలు
  • 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేశ్‌
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ  సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ పెద్దలతో మంత్రి లోకేశ్‌ భేటీ కానున్నారు. 

ప్రత్యేకించి ఏపీ పెవిలియన్ లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై  విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ఇంటిలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. 

నెక్ట్స్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎకానమీ స్థితిగతులు-లేబర్ మార్కెట్ పై ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రభావం అనే అంశంపై వైట్ షీల్డ్ తో, భవిష్యత్తుపై వాతావరణ ఉద్యమ ప్రభావం అంశంపై స్వానితి ఇనిషియేటివ్ ప్రతినిధులతో, వార్షిక లీడర్ ఫోరమ్ పునరుద్దరణపై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేశ్‌ హాజరు కానున్నారు.
 
ఐదు రోజుల సదస్సులో 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరిస్తారు. సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు. 

భారత్, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించే కార్యక్రమానికి లోకేశ్‌ అతిధిగా హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేశ్‌ వైపు పారిశ్రామికవర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 
Nara Lokesh
World Economic Forum
Davos
Andhra Pradesh

More Telugu News