Fakhar Zaman: భార‌త ఆతిథ్యంపై పాక్ క్రికెట‌ర్‌ ఫ‌క‌ర్ జ‌మాన్ ఏమ‌న్నాడంటే..!

Pakistan Star Cricketer Fakhar Zaman Honest Admission On Experience Of Touring India
  • వ‌న్డే ప్రపంచ కప్ 2023 కోసం భార‌త్‌కు వ‌చ్చిన‌ప్పుడు ల‌భించిన ఆతిథ్యంపై ఫ‌క‌ర్ హ‌ర్షం
  • హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు స్థానికులు త‌మ‌కు ఘన స్వాగతం పలికారన్న పాక్ క్రికెట‌ర్‌
  • అక్క‌డి వారు త‌మ‌పై ఎంతో ప్రేమను కురిపించారని వ్యాఖ్య‌ 
  • ఇండియాలో ఆడ‌క‌పోవ‌డాన్ని తాము క‌చ్చితంగా మిస్ అవుతామ‌న్న ఫ‌క‌ర్ జ‌మాన్‌
పాకిస్థాన్ స్టార్ క్రికెట‌ర్‌ ఫఖర్ జమాన్ 2023 ప్రపంచకప్ స‌మ‌యంలో త‌మ జ‌ట్టుకు ల‌భించిన‌ ఆతిథ్యంపై హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఆ స‌మ‌యాన్ని తాము బాగా ఆస్వాదించామ‌ని చెప్పుకొచ్చాడు. ఇండియాలో ఆడ‌క‌పోవ‌డం అనేది ఎప్పుడూ వెలితిగానే ఉంటుంద‌ని తెలిపాడు. కాగా, త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను 2027 వరకు తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణ‌యించాయి. ఇందులో భాగంగా భార‌త జ‌ట్టు త‌న‌ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడుతుందని జమాన్ చెప్పుకొచ్చాడు.

"అవును మేము క‌చ్చితంగా ఇండియాలో ఆడక‌పోవడాన్ని కోల్పోతాము. వ‌న్డే ప్రపంచ కప్ 2023 కోసం భార‌త్‌కు వెళ్లినప్పుడు మేము చాలా ఆనందించాం. అక్కడ మాకు లభించిన మద్దతు, ఆతిథ్యం మాట‌ల్లో చెప్ప‌లేం. మేము మొదటిసారి హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు స్థానికులు మాకు ఘన స్వాగతం పలికారు. వారందరూ మాపై ఎంతో ప్రేమను కురిపించారు. మేము వీట‌న్నింటినీ క‌చ్చితంగా కోల్పోతాం" అని ఫక‌ర్ జమాన్ స్పోర్ట్స్ టాక్‌తో అన్నాడు.

"భారత జ‌ట్టు పాకిస్థాన్‌కు వచ్చి ఉంటే.. మేము వారికి మరింత గొప్ప స్వాగతం, ఆతిథ్యం ఇచ్చి ఉండేవాళ్లం. కానీ వారు రావడం లేదు. ఇది నిరాశ‌ను గురిచేసే విష‌యం. కానీ దుబాయ్‌లో వారితో త‌ల‌ప‌డ‌టాన్ని మేము సంతోషిస్తున్నాం" అని జమాన్ తెలిపాడు.

ఇక భార‌త్‌, పాకిస్థాన్ 2012 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడలేదు. ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పోటీపడనున్నాయి.
Fakhar Zaman
Pakistan
Team India
Cricket
Sports News

More Telugu News