VV Lakshminarayana: ఇష్టానుసారం అరెస్ట్ చేస్తే... కోర్టులకు సమాధానం చెప్పుకోవాలి: కేటీఆర్ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన

VV Lakshminarayana opines on ED probe IN Formula E Car Racing
  • ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ
  • నేడు కేటీఆర్ ను 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు
  • కొన్ని కేసుల్లో అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చన్న మాజీ జేడీ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ను దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఓ దశలో కేటీఆర్ ను అరెస్ట్ చేయొచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే, విచారణ అనంతరం కేటీఆర్ ఇంటికి వెళ్లిపోయారు. ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. 

ఏ దర్యాప్తు సంస్థకు కూడా ఇష్టంవచ్చినట్టు అరెస్ట్ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనేది తగిన కారణాలతో జస్టిఫికేషన్ రాయాల్సి ఉంటుందని వివరించారు.

"నిందితుడ్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి... అరెస్ట్ చేసి నిరంతరాయంగా అతడ్ని విచారించాల్సిన అవసరం ఉంది... నిందితుడు దర్యాప్తులో సహకరించడంలేదు... విషయాలు ఏవీ వెల్లడించడం లేదు... కాబట్టి అతడిని సస్టెయిన్డ్ ఇంటరాగేషన్ చేయాలి... అనే అవసరం ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనేది జస్టిఫికేషన్ రాసి కోర్టుకు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. దర్యాప్తు సంస్థలు చేసిన ప్రతి చర్యకు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. 

కేటీఆర్... ఏసీబీ, ఈడీ విచారణలకు వెళ్లకముందే మీడియా సమావేశం పెట్టి ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు చెప్పారు. ఈ కేసు ఏంటి, ఈ కేసులో మేం ఏం చేశాం, ఎందుకు ఇలా డబ్బు చెల్లింపులు చేయాల్సి వచ్చింది, అందులో తమ ఉద్దేశాలు ఏంటి అనేది కూడా కేటీఆర్ వివరించారు. తమకు నేరపూరితమైన ఉద్దేశాలు లేవు, రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి అనే ఉద్దేశంతోనే వ్యవహరించామని చెప్పారు" అని లక్ష్మీనారాయణ వివరించారు.
VV Lakshminarayana
KTR
Formula E Car Racing
ED
Hyderabad
Telangana

More Telugu News