Anuj Rawat: రంజీ ప్రాక్టీస్ కు డుమ్మా కొట్టి ఐపీఎల్ క్యాంప్ లో ప్రత్యక్షమైన యువ వికెట్ కీపర్

Delhi Wicket Keeper Anuj Rawat spotted at Gujarat Titans camp instead of Ranji practise
  • దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్ కు ప్రాధాన్యమిచ్చిన అనుజ్ రావత్
  • ఢిల్లీ రంజీ జట్టు ప్రాక్టీస్ సెషన్ లో కనిపించని యువ ఆటగాడు
  • సూరత్ లో గుజరాత్ టైటాన్స్ ట్రైనింగ్ క్యాంప్ లో కనిపించిన వైనం
క్రికెటర్ల ఎదుగుదలకు దేశవాళీ క్రికెట్టే మూలాధారమని మాజీ క్రికెటర్లు స్పష్టంగా చెబుతుంటారు. అయితే, భారత యువ వికెట్ కీపర్ అనుజ్ రావత్ మాత్రం రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్ పోటీలే ఎక్కువని భావిస్తున్నాడు. రంజీ ప్రాక్టీస్ కు డుమ్మా కొట్టిన అతగాడు... ఐపీఎల్ క్యాంప్ లో ప్రత్యక్షమయ్యాడు. 

25 ఏళ్ల అనుజ్ రావత్ ఢిల్లీ రంజీ జట్టు వికెట్ కీపర్. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో అతడిని గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది. మార్చి చివరి వారం నుంచి ఐపీఎల్ పోటీలు జరగనుండడంతో, ఫ్రాంచైజీలన్నీ సన్నాహాలు మొదలుపెట్టాయి. గుజరాత్ టైటాన్స్ కూడా క్యాంప్ ప్రారంభించడంతో, మనోడు రంజీల్లో ఢిల్లీకి ఆడకుండా, సూరత్ లో జరుగుతున్న గుజరాత్ టైటాన్స్ ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నాడు.

గతంలో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఇలాగే చేశాడు. దక్షిణాఫ్రికా టూర్ నుంచి విశ్రాంతి పేరిట మధ్యలోనే వచ్చేసిన కిషన్... దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేసి భారత్ చేరుకున్నాడు. భారత్ లో దేశవాళీ క్రికెట్ లో పాల్గొనకుండా, ఐపీఎల్ ట్రైనింగ్ క్యాంప్ కు హాజరయ్యాడు. దాంతో బీసీసీఐ అతడ్ని కొన్నాళ్లపాటు పక్కనపెట్టింది. ఇప్పుడు అనుజ్ రావత్ కూడా అదే బాటలో నడిచాడు. 

దీనిపై ఢిల్లీ క్రికెట్ సంఘం కార్యదర్శి అశోక్ శర్మ స్పందించారు. అనుజ్ రాత్ రంజీ ట్రోఫీ ప్రాక్టీసుకు గైర్హాజరైన విషయం తన వరకు రాలేదని వెల్లడించారు. ఒకవేళ, రంజీ మ్యాచ్ లకు అందుబాటులో లేకుండా, ఐపీఎల్ క్యాంప్ కు హాజరవ్వాలంటే కచ్చితంగా తమ అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మరి అతడికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదని అన్నారు.
Anuj Rawat
Wicket Keeper
IPL
Ranji Trophy
Delhi

More Telugu News