Punjab Kings: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ పేరు ప్రకటించిన సల్మాన్ ఖాన్

Punjab Kings have named Shreyas Iyer as captain for the IPL 2025 season
  • నూతన సారథిగా శ్రేయాస్ అయ్యర్ ను ఖరారు చేసిన పంజాబ్ కింగ్స్
  • వినూత్నంగా హిందీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’లో ప్రకటన
  • అయ్యర్, -శశాంక్ సింగ్, చాహల్ సమక్షంలో ప్రకటించిన సల్మాన్ ఖాన్
  • యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న అయ్యర్
ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టు కెప్టెన్‌‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు వినూత్న రీతిలో హిందీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ వేదికగా ఆదివారం రాత్రి వెల్లడించింది. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు పంజాబ్ కింగ్ ప్లేయర్లు శశాంక్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ సమక్షంలో, క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ప్రకటన చేశారు. 

తనపై విశ్వాసంతో కెప్టెన్‌గా ప్రకటించిన పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌కు అయ్యర్ కృతజ్ఞతలు తెలిపాడు. నమ్మకాన్ని వమ్ముచేయబోనని, టైటిల్ రూపంలో తిరిగి చెల్లించుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘‘జట్టు యాజమాన్యం నాపై నమ్మకం ఉంచడాన్ని హూందాగా భావిస్తున్నాను. కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి మళ్లీ పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. అద్భుతమైన సామర్థ్యంతో సత్తా చాటుకున్న ఆటగాళ్ల కలయికతో జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. మేనేజ్‌మెంట్ నాపై చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జట్టుకు తొలి టైటిల్‌ను అందిస్తానని భావిస్తున్నాను’’ అని అయ్యర్ పేర్కొన్నాడు.

శ్రేయాస్ అయ్యర్‌ను జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించారు. అయ్యర్ నాయకత్వ సామర్థ్యాలు ఇప్పటికే నిరూపితమయ్యాయని, జట్టుకి టైటిల్‌ను అందించడంలో సాయపడతాయని అన్నారు. జట్టు ప్రదర్శన గురించి శ్రద్ధగా ఆలోచిస్తాడని కొనియాడారు. ఐపీఎల్‌లో గతంలో కూడా అయ్యర్‌తో కలిసి పనిచేశానని, తిరిగి కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

కాగా, 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలను గెలుచుకున్న ముంబై జట్టులో శ్రేయాస్ అయ్యర్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. ఐపీఎల్-2024 టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయ్యర్ నాయకత్వంలోని ముంబై జట్టు రెండోసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది.
Punjab Kings
Shreyas Iyer
IPL 2025
Cricket
Sports News

More Telugu News