Daggubati Family: దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు... ఏ2గా విక్టరీ వెంకటేశ్

Film Nagar police files case against Daggubati Venkatesh family
  • ఓ స్థల వివాదంలో నాంపల్లి కోర్టు ఆదేశాలు
  • వెంకటేశ్, రానా, తదితరులపై కేసు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు
డెక్కన్ కిచెన్ హోటల్ వివాదంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబంపై కేసు నమోదైంది. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో విక్టరీ వెంకటేశ్ ను ఏ2గా పేర్కొన్నారు. నందకుమార్ అనే వ్యక్తికి, దగ్గుబాటి కుటుంబానికి డెక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. 2022లో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి కుటుంబం ఈ హోటల్ ను కొంతమేర ధ్వంసం చేసింది. 

నందకుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో... ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ... గతేడాది జనవరిలో దగ్గుబాటి ఫ్యామిలీ ఆ హోటల్ ను పూర్తిగా నేలమట్టం చేసింది. దాంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 

నిన్న నందకుమార్ పిటిషన్ ను విచారించిన కోర్టు... దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. 

నాంపల్లి కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో... ఫిలింనగర్ పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీపై 448, 452, 458, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏ1గా దగ్గుబాటి సురేశ్, ఏ2గా వెంకటేశ్, ఏ3గా దగ్గుబాటి రానా, ఏ4గా దగ్గుబాటి అభిరామ్ లను పేర్కొన్నారు.
Daggubati Family
Venkatesh
Suresh Babu
Deccan Kitchen Hotel
Police
Namapally Court
Hyderabad
Tollywood

More Telugu News