Jasprit Bumrah: టీమిండియాకు ఎదురుదెబ్బ.. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లకు బుమ్రా దూరం

Bumrah set to miss Champions Trophy group stage matches
  • వెన్నెముక గాయంతో బాధపడుతున్న బుమ్రా
  • మార్చి మొదటి వారం నాటికి జట్టుకు అందుబాటులోకి!
  • చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రతిపాదిత జట్టు వివరాలను ఐసీసీకి అందించిన బీసీసీఐ
  • ఫిబ్రవరి 12 వరకు జట్టులో మార్పు చేర్పులకు అవకాశం
  • ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరోగ్య కారణాలతో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బుమ్రాను పునరావాసం కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎస్‌సీఏ)కు వెళ్లాలని బీసీసీఐ కోరినట్టు తెలిసింది. 

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా-పాక్ తలపడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. టాప్-8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. 

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు నిన్న ముంబైలో సెలక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుమ్రా ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చినట్టు తెలిసింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం నేడు జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ దానిని పొడిగించినట్టు సమాచారం.

బుమ్రా గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో అతడి పేరును 15మందితో కూడిన జట్టులో ఉంచాలా? లేదంటే రిజర్వు ఆటగాళ్లలో ఉంచాలా? అన్న విషయాన్ని సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు, చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత ప్రతిపాదిత జట్టును ఐసీసీకి బీసీసీఐ సమర్పించింది. ఫిబ్రవరి 12 వరకు జట్టులో మార్పు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు సమయం ఉండటంతో బుమ్రా పరిస్థితిని పర్యవేక్షించే అవకాశం దక్కింది. అయితే, మార్చి మొదటి వారం నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది.

చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడుతుంది. కాబట్టి అప్పటికి బుమ్రా రెడీ అవుతాడా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్‌తో తలపడుతుంది.  
Jasprit Bumrah
Team India
Champions Trophy 2025
BCCI

More Telugu News