Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో భారీ ఊర‌ట‌

Another Relief for Allu Arjun in Sandhya Theatre Stampede Case
  • ప్ర‌తి సండే చిక్క‌డ‌ప‌ల్లి పీఎస్‌కు హాజ‌రు కావాల‌నే ష‌ర‌తు నుంచి బ‌న్నీకి మిన‌హాయింపు
  • భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు కోరిన అల్లు అర్జున్‌ 
  • బ‌న్నీ అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ ష‌ర‌తు నుంచి మిన‌హాయింపు ఇచ్చిన నాంప‌ల్లి కోర్టు
గ‌తేడాది డిసెంబ‌ర్ 4న 'పుష్ప‌-2: ది రూల్' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా చోటుచేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న కేసులో హీరో అల్లు అర్జున్‌కు మ‌రో ఊర‌ట ల‌భించింది. ప్ర‌తి ఆదివారం చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌నే ష‌ర‌తు నుంచి బ‌న్నీకి నాంప‌ల్లి కోర్టు మిన‌హాయింపు క‌ల్పించింది.  

కాగా, ఐకాన్ స్టార్ దాఖ‌లు చేసిన రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్‌పై ఈ నెల 3న న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఆదివారం చిక్క‌డ‌ప‌ల్లి పీఎస్‌లో హాజ‌రు, రూ. 50వేల రెండు పూచీక‌త్తుల‌తో పాటు సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌రాద‌నే ష‌ర‌తుల‌తో బెయిల్ మంజూరు చేసింది. 

కోర్టు ఆదేశాల మేర‌కు గ‌త ఆదివారం బ‌న్నీ స్వ‌యంగా చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి సంత‌కం చేశారు. అయితే, భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా త‌న‌కు ఈ వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఆయ‌న కోర్టును విన్నవించారు. దాంతో అల్లు అర్జున్ అభ్య‌ర్థ‌న‌పై సానుకూలంగా స్పందించిన‌ నాంప‌ల్లి కోర్టు ఆయ‌న‌కు ఈ ష‌ర‌తు నుంచి మిన‌హాయింపు ఇచ్చింది.
Allu Arjun
Sandhya Theatre Stampede
Hyderabad
Tollywood

More Telugu News