Mohammed Shami: టీమిండియాకు బిగ్ బూస్ట్.. స్టార్ బౌలర్ రీఎంట్రీకి మార్గం సుగమం!

a big boost for Team India has reportedly come in the form of veteran pacer Mohammed Shami
  • పునరాగమనం చేయబోతున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ
  • బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చిందన్న ‘క్రిక్‌బజ్’
  • ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేసే అవకాశాలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టుని ప్రకటించడానికి సమయం దగ్గర పడిన తరుణంలో టీమిండియాకు బిగ్ బూస్ట్ ఇచ్చే అప్‌డేట్ వచ్చింది. ఫిట్‌నెస్ నిరూపించుకోలేక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికకాని స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ దాదాపు ఖాయమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు, ఆ తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేయడానికి సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారని ‘క్రిక్‌బజ్’ పేర్కొంది. 

ఈ మేరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల బృందం మహ్మద్ షమీకి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిపింది. దీంతో, అంతర్జాతీయ క్రికెట్‌లో షమీ రీఎంట్రీకి మార్గం సుగమం అయినట్టేనని పేర్కొంది. అయితే, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం ఎంపిక చేసే అవకాశం లేదు. చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకున్న అనంతరం బెంగాల్ తరఫున షమీ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫర్వాలేదనిపిస్తున్నాడు.

షమీ చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. చీలమండ గాయం అవడంతో లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకొని ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. నిజానికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ, పూర్తి ఫిట్‌నెస్‌ లేకపోవడంతో చివరి నిమిషంలో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. కాగా, జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. 
Mohammed Shami
Team India
Cricket
Sports News

More Telugu News