Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డికి హైకోర్టులో షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

Chevireddy Bhasker Reddy Quash Petition Rejected By AP High Court
  • చెవిరెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు
  • బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి వ్యాఖ్యలు
  • చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసేందుకు నిరాకరిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. చెవిరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చింది. గతంలో పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి వ్యాఖ్యానించారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలంటూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది.

చెవిరెడ్డిపై ఇదీ కేసు..
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14) ఇటీవల తనపై దుండగులు దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పింది. స్కూలు నుంచి తిరిగి వస్తుంటే ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు తనను అడ్డుకుని, మత్తుమందు తాగించారని తెలిపింది. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సదరు బాలిక చదివే స్కూలుకు వెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు సదరు బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. అయితే, బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Chevireddy Bhaskar Reddy
YSRCP
Andhra Pradesh
Pocso Case
AP High Court

More Telugu News