Chandrababu: హ్యూమన్ సైకాలజీ తెలియదా?: టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై చంద్రబాబు ఆగ్రహం

Dont you know human psychology Chandrababu fires on TTD EO and Dist Collector
  • తిరుపతి తొక్కిసలాట ఘటనాస్థలిని పరిశీలించిన చంద్రబాబు
  • పరిమితికి మించి భక్తులను ఎలా అనుమతించారని ప్రశ్న
  • భక్తులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపాటు
  • పద్ధతి ప్రకారం పని చేయాలని హెచ్చరిక
  • తమాషా అనుకోవద్దని సీరియస్ వార్నింగ్
తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న ప్రదేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరకున్న చంద్రబాబు... అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న ప్రమాదస్థలికి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, అనిత, సత్యకుమార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా ఘటనకు గల కారణాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. టీటీడీ ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, గేటు తీసిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని టీటీడీ ఈవో చెప్పగా... హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలియదా? అని ప్రశ్నించారు. 2 వేల మంది పట్టే స్థలంలో 2,500 మందిని ఎలా ఉంచారని అడిగారు. పరిమితికి మించి భక్తులను ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

విధులు కేటాయించిన పోలీసు అధికారికి ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని ప్రశ్నించారు. ఇంత అధికార యంత్రాంగం ఉండి కూడా టికెట్ల పంపిణీ సరిగా ఎందుకు చేయలేకపోయారని అడిగారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనాస్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ఏమీ జరగక ముందే చర్యలు తీసుకుంటే దాన్ని అడ్మినిష్ట్రేషన్ అంటారని... ప్రమాదం జరిగిన తర్వాత ఎంత చేస్తే మాత్రం ఏం ఉపయోగమని అన్నారు. 

భవిష్యత్తులో ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. పద్ధతి ప్రకారం పని చేయాలని, పద్ధతి ప్రకారం పని చేయడాన్ని నేర్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా అనుకోవద్దు అని మండిపడ్డారు. బాధ్యత తీసుకున్నవారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
Chandrababu
Telugudesam
Tirupati

More Telugu News