Jasprit Bumrah: గాయంపై ఇంకా రాని స్ప‌ష్ట‌త‌... ఇంగ్లండ్ సిరీస్‌కు బుమ్రా దూరం..!

India Suffer Big Jasprit Bumrah Blow Ahead Of England Series Report Says Pacer To Miss
  • బీజీటీ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన జ‌స్ప్రీత్ బుమ్రా
  • సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి మ్యాచ్ మ‌ధ్య‌లో గాయంతో త‌ప్పుకున్న పేస‌ర్‌
  • జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్ 
  • ఈ సిరీస్‌లో బుమ్రా ఆడ‌డం అనుమానం
  • అత‌ని వెన్నునొప్పిపై ఇంకా రాని స్ప‌ష్ట‌త‌
వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా స్టార్ పేస‌ర్‌ జస్ప్రీత్ బుమ్రా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే వైట్-బాల్ సిరీస్‌లో విశ్రాంతి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. జనవరి 22 నుంచి భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ఇక తాజాగా ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. ఈ సిరీస్‌ను భార‌త్ కోల్పోయిన‌ప్ప‌టికీ ఈ స్టార్ పేస‌ర్ 32 వికెట్ల‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక‌ 30 ఏళ్ల బుమ్రా ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయ‌డం విశేషం.

కాగా, బుమ్రా వెన్నునొప్పి గాయం తీవ్రతపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దాంతో గ్రేడ్ ఇంకా నిర్ధారించలేదు. బుమ్రా గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, రిటర్న్ టు ప్లే (ఆర్‌టీపీ)కి ముందు కనీసం రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవ‌స‌రం అవుతుంది. అలాగే గ్రేడ్ 2 గాయం విషయంలో రికవరీకి ఆరు వారాల వరకు స‌మ‌యం పడుతుంది. కానీ, గ్రేడ్ 3 గాయం విష‌యంలో మాత్రం కనీసం మూడు నెలల విశ్రాంతి, పునరావాస కార్యక్రమాలు అవసరమ‌వుతాయి. 

గాయం కాకపోయి ఉన్నా, బుమ్రా స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగే టీ20 ద్వైపాక్షిక సిరీస్ కు దూరంగా ఉండేవాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా అతను క‌చ్చితంగా ఇంగ్లండ్‌తో 50 ఓవర్ల ఫార్మాట్‌లో మూడు వ‌న్డేలు ఆడేవాడు. అయితే, ఇప్పుడు గాయం కార‌ణంగా ఇందులో (వన్డే సిరీస్) ఆడ‌డం అనుమానంగా మారింది. 

బుమ్రా ఒక‌వేళ గాయం నుంచి కోలుకుంటే త‌న ఫిట్‌నెస్‌ని చెక్ చేసుకోవ‌డానికి ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లోని తన హోమ్‌గ్రౌండ్‌లో ఇంగ్లండ్ తో జ‌రిగే వ‌న్డేలో బ‌రిలోకి దిగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక భారత్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభించనుంది.


Jasprit Bumrah
Team India
Cricket
Sports News

More Telugu News