UP Bride: బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి పెళ్లి పీటల మీద నుంచి వధువు జంప్

UP Bride Takes Bathroom Break Mid Wedding Runs Away With Jewellery
  • యూపీలో డబ్బు, నగలతో పరారైన పెళ్లికూతురు
  • మీడియా ముందు వాపోయిన 40 ఏళ్ల పెళ్లి కొడుకు
  • రూ.30 వేలు కమీషన్ ఇచ్చి రెండో పెళ్లి కుదుర్చుకున్నట్లు వెల్లడి
గుడిలో వివాహం జరుగుతోంది.. పూజారి మంత్రాలు చదువుతుండగా అర్జెంట్ అవసరమని చెప్పి వధువు బాత్రూంకు వెళ్లింది. అంతే, మళ్లీ తిరిగిరాలేదు. ఒంటిమీదున్న నగలతో పాటు చేతికందిన డబ్బుతో పరారైంది. యూపీలోని ఖాజ్ని ఏరియాలో చోటుచేసుకుందీ ఘటన. దీంతో మోసపోయానంటూ 40 ఏళ్ల వరుడు మీడియాను ఆశ్రయించాడు. 

అసలేం జరిగిందంటే..
ఖాజ్ని ఏరియాకు చెందిన ఓ వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. అయితే, భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకోవాలని ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించాడు. మధ్యవర్తికి రూ.30 వేలు కమిషన్ ఇచ్చి ఓ సంబంధం కుదుర్చుకున్నాడు. వివాహ ఖర్చులు భరించడంతో పాటు వధువుకు పలు ఆభరణాలు చేయించేందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న ముహూర్తానికి గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశాడు. దగ్గరి బంధువుల సమక్షంలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. వధూవరులు ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి పూజారి పెళ్లి తంతు నిర్వహిస్తున్నాడు.

ఇంతలో అర్జెంట్ గా బాత్రూంకు వెళ్లాలని చెప్పి వధువు పీటల మీద నుంచి లేచింది. తల్లిని తోడుగా తీసుకుని బాత్రూం వైపు వెళ్లిన వధువు ఎంతకీ తిరిగిరాలేదు. ఏం జరిగిందని పెళ్లికొడుకు తరఫు బంధువులు వెళ్లి చూడగా.. బాత్రూం ఖాళీగా ఉండగా, వధువు ఎక్కడా కనిపించలేదు. దీంతో జరిగిన మోసం బయటపడింది. డబ్బు, నగలతో వధువు పారిపోయిందని గుర్తించిన వరుడు మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకుందామని చూస్తే ఉన్నదంతా పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
UP Bride
Wedding
Bathroom Break
Jewellery
Bride Ellope
Offbeat

More Telugu News