WTC Points Table: టీమిండియా కలలన్నీ కల్లలు.. అప్‌డేట్ అయిన డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఇదే

Indias dreams of reaching the World Test Championship Final were completely dashed
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడంతో చేజారిన ఫైనల్ అవకాశాలు
  • డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి పరిమితమైన భారత జట్టు 
  • ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా టీమ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా కలలన్నీ కల్లలయ్యాయి. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో చేజార్చుకోవడంతో తుది పోరుకు అర్హత సాధించే అవకాశాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. సిడ్నీ వేదికగా ఐదవ టెస్ట్ మ్యాచ్‌ ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక అప్‌డేట్ అయింది.

భారత్ 50 పీసీటీ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 63.73 పీసీటీ పాయింట్లతో  నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా ఇప్పటికే 66.67 పీసీటీ పాయింట్లతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ మ్యాచ్‌లన్నీ ముగిసిపోయాయి. మిగతా జట్లకు కూడా ఫైనల్ చేరుకునే అవకాశాలు లేవు. దీంతో జూన్ 11 నుంచి 15 మధ్య ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

కాగా, సిడ్నీ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన ఆరంభ మ్యాచ్‌‌లో భారత్ విజయం సాధించగా... ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి డ్రా అవగా, మిగతా మ్యాచ్‌లు అన్నింటిలోనూ భారత్ పరాజయం పాలైంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది.
WTC Points Table
Cricket
Sports News
Team India

More Telugu News