Nara Lokesh: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh speech in  Mid Day Meal inauguration event held at Payakapuram Govt Jr College
  • ఏపీలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం
  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
  • విజయవాడ పాయకాపురం కాలేజీలో పథకం ప్రారంభించిన నారా లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ప్రారంభించిన ఆయన, కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను తీసుకున్న తొలి నిర్ణయం... 'విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఉండకూడదు' అని వెల్లడించారు. 

విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ తమ ఫొటోలు ఉండవని, తమ పార్టీ రంగులు ఉండవని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చే మెటీరియల్ లోనూ తమ పేర్లు ఉండవని తెలిపారు. సమాజం కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మనం మంచి పనులు చేయాలనుకుంటామో, వారి పేర్లు పెట్టామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 

"డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లు అందజేశాం. ఇవాళ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం తీసుకువచ్చాం. గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే, ముందుగా పట్టుకెళ్లేది విద్యార్థులనే. ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగితే పిల్లలు వెళ్లాలి, మంత్రి ప్రోగ్రామ్ జరిగితే పిల్లలు వెళ్లాలి... కానీ నేను విద్యాశాఖ మంత్రిగా రాగానే... మన పిల్లలు ఎక్కడికీ వెళ్లరు, కేవలం చదువుకుంటారు అని ఆదేశాలు జారీ చేశాను. అంతేకాదు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కేవలం జాబ్ మేళాలు మినహా మరే ఇతర కార్యక్రమాలు జరిపేందుకు వీల్లేదని చెప్పాను. 

ఇక, ఉపాధ్యాయులు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిపై యాప్ ల భారం విపరీతంగా ఉంది. ఆ యాప్ ల భారం తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది" అని మంత్రి నారా లోకేశ్ వివరించారు.
Nara Lokesh
Mid Day Meal For Inter Students
Vijayawada
TDP-JanaSena-BJP Alliance

More Telugu News