Viral News: విమానంలో నిద్రిస్తున్న తోటి ప్యాసింజర్‌పై మూత్రవిసర్జన

A man has been banned by United Airlines after he urinated on another passenger
  • జీవితకాల నిషేధం విధించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్
  • నిందితుడిని పోలీసులకు అప్పగించామని వెల్లడి
  • గత నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి మనీలాకు ప్రయాణించిన విమానంలో ఘటన
అమెరికా కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహించే విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్యాసింజర్‌పై జీవితకాల నిషేధం విధించింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విమానం మార్గమధ్యంలో నిద్రిస్తున్న తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడంతో నిందిత వ్యక్తిపై ఎయిర్‌లైన్స్ ఈ చర్య తీసుకుంది.

నిషేధానికి గురైన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. గత నెల 28న యూఎస్‌‌లోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు ‘యూఏ ఫ్లైట్ 189’లో అతడు ప్రయాణించాడు. విమానం నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత తన సీటు నుంచి లేచి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న జెరోమ్ గుటిరెజ్‌ అనే ప్యాసింజర్‌పై మూత్రం పోశాడు. ఆ సమయంలో బాధిత ప్యాసింజర్ గాఢ నిద్రలో ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో జెరోమ్ గుటిరెజ్ నిద్రపోతున్నారని, తొలుత కల అనుకున్నారని, అయితే మూత్రం ఉదర భాగం నుంచి పాదాల వరకు కారడంతో విషయాన్ని గుర్తించి ఉలిక్కిపడి లేచారని ఆయన కూతురు నికోల్ కార్నెల్ తెలిపింది. విషయాన్ని విమాన సిబ్బంది తెలియజేయగా నిందిత ప్యాసింజర్‌ను ప్రశ్నించవద్దని సూచించారని, విమానంలో ఘర్షణకు దారితీస్తుందేమోనంటూ భయపడ్డారని నికోల్ కార్నెల్ వివరించింది.

ఈ ఘటన విషయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వ్యవహార శైలి చాలా చూసి అసహ్యం అనిపించిందని, షాక్‌లో ఉన్నానని కార్నెల్ చెప్పింది. అయితే, ఈ ఘటనను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది. విమానం ఫిలిప్పైన్స్ చేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించామని, నిందితుడిపై నిషేధం కూడా విధించామని వెల్లడించింది.
Viral News
USA
United Airlines
Off Beat News

More Telugu News