Donald Trump: ట్రంప్ కు శిక్ష తప్పదు.. కానీ జైలుకు వెళ్లే పరిస్థితి రాదు.. అదెలాగంటే!

Judge Says Trump To Be Sentenced In Hush Money Case On January 10
  • హష్ మనీ కేసులో ఈ నెల 10 న తుదితీర్పు
  • ఈ కేసులో ట్రంప్ ను ఇప్పటికే దోషిగా తేల్చిన జ్యూరీ
  • అన్ కండిషనల్ డిశ్చార్జ్ అమలు చేస్తానంటూ న్యూయార్క్ జడ్జి వ్యాఖ్య 
అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, హష్ మనీ కేసులో ట్రంప్ ను న్యూయార్క్ కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. ఈ కేసులో ట్రంప్ కు ఈ నెల 10 న శిక్ష ఖరారు చేస్తామని న్యూయార్క్ జడ్జి జస్టిస్ హవాన్ మర్చన్ పేర్కొన్నారు. దోషిగా తేలిన ట్రంప్ కు శిక్ష విధించడం తప్పదని చెబుతూనే ఆయన జైలుకు వెళ్లే అవసరం మాత్రం లేదని జస్టిస్ హవాన్ పేర్కొన్నారు. ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, ట్రంప్ కు అన్ కండిషనల్ డిశ్చార్జ్ అమలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన హష్ మనీ కేసులో తుది తీర్పు వెలువరిస్తామని, ఆ రోజు వ్యక్తిగతంగానైనా లేక వర్చువల్ గా నైనా ట్రంప్ కోర్టుకు హాజరుకావొచ్చని తెలిపారు. ఒకవేళ ట్రంప్ కు శిక్ష ఖరారైతే.. దోషిగా తేలి శిక్ష ఖరారైన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.

హష్ మనీ కేసులో నుంచి ట్రంప్ ను తప్పించేందుకు ఆయన లాయర్లు విశ్వప్రయత్నం చేశారు. ట్రంప్ పై ఆరోపణలను కొట్టివేయాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ కు ఈ కేసు నుంచి రక్షణ లభిస్తుందని వాదించారు. అయితే, ట్రంప్ లాయర్ల వాదనలను న్యూయార్క్ జ్యూరీ తోసిపుచ్చింది. ప్రెసిడెంట్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మాత్రమే రక్షణ ఉంటుందని, వ్యక్తిగతమైన కేసులకు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని జ్యూరీ స్పష్టం చేసింది. హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా నిర్ధారణ కావడంతో శిక్ష విధించడం తప్పదని పేర్కొంది. ఈమేరకు జస్టిస్ హవాన్ మర్చన్ 18 పేజీల తుది తీర్పును ఈ నెల 10న వెలువరిస్తామని చెప్పారు.

హష్ మనీ కేసు..
డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో గతంలో సన్నిహితంగా గడిపారని, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పకుండా డబ్బు చెల్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును హష్ మనీ పేరుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల నుంచి స్టార్మీ డేనియల్స్ కు సొమ్ము చెల్లించారని, ఈ విషయం బయటపడకుండా రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన రికార్డుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణలో ట్రంప్ పై అభియోగాలన్నీ నిజమేనని ప్రాసిక్యూషన్ నిరూపించింది. స్టార్మీ డేనియల్ ను కోర్టులో హాజరుపరిచి సాక్ష్యం ఇప్పించింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యూయార్క్ జ్యూరీ.. ట్రంప్ ను దోషిగా నిర్ధారించింది.
Donald Trump
Hush Money Case
Sentence
New Yark Judge
America President
Porn Star

More Telugu News