hyderabad: వేగవంతంగా పాస్‌పోర్టుల జారీ: ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ

hyderabad regional passport officer snehaja says issue of passports will be speedy
  • అపాయింట్ మెంట్ గడువు 6 -8 రోజులకు కుదింపు
  • 2024లో 9.02 లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్న ప్రాంతీయ పాస్ పోర్టు అధికారిణి స్నేహజ
  • తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం హైదరాబాద్ ఆర్పీవోలో అటెస్టేషన్, అపోస్టిల్ సౌకర్యం
రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా పాస్ పోర్టులు జారీ చేస్తామని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం (ఆర్పీవో) పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పాస్‌పోర్టుల అపాయింట్‌మెంట్ విషయంలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం అరుదైన మైలురాయిని చేరుకుందని తెలిపారు. 2023 సంవత్సరంలో అపాయింట్‌మెంట్ కోసం 22 రోజులు పట్టేదని, పోలీస్, తపాలా శాఖల సహకారంతో 2024లో 6 - 8 రోజులకు కుదించినట్లు తెలిపారు. 

ఆర్పీవో హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్‌కే), 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్‌కే) పని చేస్తున్నాయని, వీటి ద్వారా గత ఏడాది ప్రతి రోజు సగటున 4,200 దరఖాస్తులను పరిశీలించామని చెప్పారు. పాస్‌పోర్టుల జారీ, పోలీస్ క్లీయరెన్స్ సర్టిఫికెట్ సేవలతో కలిపి 9.02 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. నిజామాబాద్ లో సాధారణ అపాయింట్‌మెంట్‌లను మరుసటి పని దినంలో, పీవోపీఎస్‌కేలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. 

వరంగల్లులో అత్యధికంగా రోజుకు 130కిపైగా, మిగతా కేంద్రాల్లో 90 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. తత్కాల్ పాస్ పోర్టులు 1 – 3 పని దినాల్లోనే జారీ చేస్తున్నామని వెల్లడించారు. సాధారణ పాస్ పోస్టులన్నీ పోలీసు ధ్రువీకరణ సమయం మినహా 5 – 7 పని దినాల్లో జారీ అవుతున్నాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామని దీని వల్ల గత ఏడాది 30వేల మందికి పైగా నేరుగా సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. మెయిల్స్ ద్వారా వచ్చిన పది వేలకుపైగా ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు.

సంచార పాస్‌పోర్టు సేవల కోసం ప్రత్యేక వ్యాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తమ పనితీరు కొనసాగిస్తామని ఆమె వివరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం హైదరాబాద్ ఆర్పీవోలో అటెస్టేషన్, అపోస్టిల్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. 
hyderabad
regional passport officer
snehaja
passports
Telangana

More Telugu News