Rohit Sharma: టెస్టుల్లోనే కాదు... వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ ఔట్?

A report claimed that Rohit sharma Will not play in Champion Trophy 2025
  • ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కెప్టెన్సీని హార్ధిక్ పాండ్యాకు అప్పగించే అవకాశాలు
  • టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు వెలువడుతున్న కథనాలు
  • రోహిత్‌పై కెప్టెన్సీ భారం పడుతుందని భావిస్తున్నట్టుగా సమాచారం
అనూహ్య రీతిలో సిడ్నీ టెస్టులో భారత తుది జట్టులో చోటు కోల్పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్ కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో, కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్‌లో డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. 

అయితే, టెస్ట్ ఫార్మాట్‌లోనే కాదు ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ కొత్త కథనం తెరపైకి వచ్చింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేయవచ్చని ‘మై ఖేల్’ పేర్కొంది. ఈ మేరకు టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించింది. ‘‘అధిక ఒత్తిడి పరిస్థితుల్లోనూ పాండ్యా రాణిస్తాడు. ఆల్‌రౌండర్‌గా అపార అనుభవం. కెప్టెన్‌గా రాణించిన అనుభవం దృష్ట్యా పాండ్యా బెస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్నాడు’’ అని విశ్లేషించింది.

రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. అతి త్వరలోనే టెస్ట్ ఫార్మాట్‌ నుంచి కూడా రిటైర్‌మెంట్ ఖాయమనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ భారాన్ని అతడిపై మోపకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఐదవ టెస్టుకు దూరమవ్వడంతో రోహిత్ శర్మ భవిష్యత్‌పై పలు ఊహాగానాలకు దారితీస్తోంది. కాగా, పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.
Rohit Sharma
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News