Cricket Australia: టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ను ప్ర‌క‌టించిన సీఏ... కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా!

Jasprit Bumrah named captain Pat Cummins left out of Cricket Australias Test Team of the Year 2024
  • 2024 ఏడాదికి గాను 11 మంది ఆట‌గాళ్ల‌తో మెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌
  • భార‌త్ నుంచి జ‌స్ప్రీత్ బుమ్రా, య‌శ‌స్వి జైస్వాల్‌ కు జ‌ట్టులో చోటు
  • ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, కివీస్ నుంచి ఇద్దరు, ఆసీస్ నుంచి ఇద్ద‌రు ప్లేయ‌ర్ల ఎంపిక‌
  • శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికా నుంచి చెరో ఆట‌గాడిని ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2024 ఏడాదికి గాను 11 మంది ఆట‌గాళ్ల‌తో మెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అయితే, ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా అనూహ్యంగా టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం త‌మ దేశ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ క‌మిన్స్ ను కాద‌ని బుమ్రాను సార‌థిగా ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే భార‌త్ నుంచి యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌కు కూడా జ‌ట్టులో చోటు క‌ల్పించింది. 

22 ఏళ్ల ఈ యువ ప్లేయ‌ర్ ఈ ఏడాది మొత్తం 15 టెస్టు మ్యాచ్ లు ఆడి 54.74 స‌గ‌టుతో ఏక‌గా 1,478 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 214 నాటౌట్‌. ఇక బుమ్రా కూడా ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్ లు ఆడిన ఈ స్పీడ్‌స్ట‌ర్ 71 వికెట్లు ప‌డగొట్టాడు. 5 సార్లు ఫైఫ‌ర్ న‌మోదు చేశాడు. దీంతో భార‌త్ నుంచి ఈ ఇద్ద‌రికి మాత్ర‌మే సీఏ త‌న‌ జ‌ట్టులో చోటు క‌ల్పించింది. 

అలాగే ఇంగ్లండ్ నుంచి బెన్ డకెట్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్ ల‌కు ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది. న్యూజిలాండ్ నుంచి ర‌చిన్ ర‌వీంద్ర‌, మ్యాట్ హెన్రీ ఎంపిక‌య్యారు. ఇక‌ శ్రీలంక నుంచి క‌మిందు మెండీస్... ఆస్ట్రేలియా నుంచి అలెక్స్ కెరీ, జోష్ హేజిల్‌వుడ్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ద‌క్షిణాఫ్రికా నుంచి స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హారాజ్‌కు చోటు ద‌క్కడం విశేషం. 

జ‌ట్టు: జ‌స్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), య‌శ‌స్వి జైస్వాల్‌, బెన్ డ‌కెట్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్, అలెక్స్ కెరీ (వికెట్ కీప‌ర్), క‌మిందు మెండిస్, ర‌చిన్ ర‌వీంద్ర‌, మ్యాట్ హెన్రీ,  జోష్ హేజిల్‌వుడ్, కేశ‌వ్ మ‌హారాజ్‌    
Cricket Australia
Jasprit Bumrah
Yashasvi Jaiswal
Cricket
Sports News

More Telugu News