కాసులకు కక్కుర్తిపడి ఆ ప్రచారం చేయకండి: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన

Sajjanar suggetion to social media influencers
  • ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయవద్దని సూచన
  • అమాయకులు బెట్టింగ్‌లకు వ్యసనపరులుగా మారిపోతున్నారని ఆందోళన
  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి బెట్టింగ్ మాయలో పడవద్దని ప్రజలకు సూచన
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ సూచన చేశారు. డబ్బులకు కక్కుర్తిపడి ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయద్దని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను తన ఖాతాలో ట్వీట్ చేస్తూ... ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

"సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లారా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయకండి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని... మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు. బంగారు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు" అని ఎక్స్ వేదికగా సూచించారు.

మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివన్నారు. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలన్నారు.

"స్వార్థ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి... చాపకింద నీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండి" అని రాసుకొచ్చారు.
Go Back to Shorts
Sajjanar
Telangana
Social Media

More Telugu News