Kerala MLA: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..!

Kerala MLA Reaction On Her Son Among 9 Arrested For Possessing Ganja
  • తొమ్మిది మందిని అరెస్టు చేశామన్న ఎక్సైజ్ అధికారులు
  • తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసిన ఎమ్మెల్యే ప్రతిభ
  • అధికారులు తన కొడుకును కేవలం ప్రశ్నించారని వివరణ
కేరళ ఎమ్మెల్యే, సీపీఎం నేత యు.ప్రతిభ కొడుకును గంజాయి కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కొడుకుతో పాటు మొత్తం తొమ్మిది మంది యువకులను అరెస్టు చేశామని చెప్పారు. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడులో గంజాయి సిగరెట్లు తాగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే, పట్టుబడ్డ గంజాయి చాలా స్వల్ప మొత్తం కావడంతో వారందరినీ బెయిల్ పై విడుదల చేసినట్లు చెప్పారు. ఈ వార్తలు మీడియా ప్రసారం చేయడంతో ఎమ్మెల్యే ప్రతిభ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు అరెస్టు కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.

తన కొడుకు అతడి స్నేహితులతో కలిసి కూర్చున్న సమయంలో ఎక్సైజ్ అధికారులు అక్కడికి వచ్చారని, అందరితో పాటు తన కొడుకును కూడా ప్రశ్నించారని చెప్పారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. ఈ వార్తలు చూసి తనకు చాలామంది ఫోన్ చేస్తున్నారని, నిరాధార కథనాలను ఇప్పటికైనా ఆపేయాలని కోరారు. తన కొడుకు అరెస్టు వార్తలు నిజమే అయితే తాను బహిరంగ క్షమాపణ చెబుతానని, తప్పుడు వార్తలైతే మీడియా కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాగా, అరెస్టు వార్తలపై ఎమ్మెల్యే ప్రతిభ కొడుకు కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. గంజాయి కేసులో తనను అరెస్టు చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.
Kerala MLA
MLA Son Arrest
Ganja
Weed

More Telugu News