Virat Kohli: సచిన్, బ్రియాన్ లారా కంటే విరాట్ కోహ్లీ గ్రేట్.. ఆసీస్ మాజీ క్రికెటర్ చెప్పిన కారణాలు ఇవే

Former Australia opener Justin Langer called Virat Kohli the best player he has ever seen
  • తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు విరాట్ అని ప్రశంసించిన జస్టిన్ లాంగర్
  • బంతిని గమనించి ఆడే విధానం, వికెట్ల మధ్య పరిగెత్తే తీరు అద్భుతమంటూ ప్రశంసలు
  • ఫీల్డింగ్, నాయకత్వ శైలి విషయంలో కూడా కోహ్లీ గ్రేట్ అంటూ మెచ్చుకోలు
  • కోహ్లీ ఆడే షాట్లు, కవర్ డ్రైవ్‌లు చూసి తాను మాట్లాడడం లేదన్న జస్టిన్ లాంగర్
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం విరాట్‌ను తెగపొగిడేస్తున్నాడు. తన జీవిత కాలంలో ఎవరైనా ఒక అత్యుత్తమ బ్యాట‌ర్‌ను ఎంచుకోమంటే క్రికెట్ ప్రపంచ చరిత్రలో కోహ్లీ అందరి కంటే ఉత్తమం అని చెబుతానని వ్యాఖ్యానించాడు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాల కంటే కూడా విరాట్ బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.

‘‘ నా అభిప్రాయంతో కొందరు ఏకీభవించరు. కానీ, నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయే. సచిన్ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, బ్రియాన్ లారా వంటి దిగ్గజాలతో ఆడటం నా జీవితంలో లభించిన విశేషాలలో ఒకటి. నా దగ్గర చివరిగా ఒకే ఒక్క రూపాయి లేదా డాలర్ ఉన్నట్టయితే దానిని బ్రియాన్ లారా బ్యాటింగ్ చూడటానికి వెచ్చిస్తాను. అదే నా దగ్గర చాలా డబ్బు ఉంటే జీవితాంతం విరాట్ బ్యాటింగ్ చూడడానికే ఖర్చుపెడతాను’’ అంటూ కోహ్లీని ఆకాశానికి ఎత్తాడు.

కోహ్లీ ఆడే చక్కని షాట్లు, కవర్ డ్రైవ్‌లు, హుక్ షాట్‌లు చూసి తాను మాట్లాడడం లేదని, అతడు బంతిని గమనించి ఆడే విధానం, వికెట్ల మధ్య పరిగెత్తే తీరు, అతని ఫీల్డింగ్, నాయకత్వ శైలిని చూసి మాట్లాడుతున్నానంటూ జస్టిన్ లాంగర్ సమర్థించుకున్నాడు. ఫిట్‌నెస్ స్థాయి విషయంలో కోహ్లీని మించినవారు లేరని కితాబిచ్చాడు. విరాట్ సాధించిన గణాంకాలు అతడు ఎలాంటి ఆటగాడో చెబుతాయని, ఆ గణాంకాలు చూస్తే ఎవరూ వాదించలేరని, అందుకే తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లీ అని లాంగర్ మెచ్చుకున్నాడు.

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జస్టిన్ లాంగర్ ఆట రెండవ రోజున ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్టులో సాధించిన సెంచరీ మినహా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు.
Virat Kohli
Justin Langer
Cricket
Sports News
Viral News

More Telugu News