Sandalwood: ఎర్రచందనానికి అంత సీన్ లేదు 'పుష్పా'!

No Demand For Sandalwood In Global Market
  • ఎర్రచందనం విక్రయానికి ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు
  • టన్ను ధర రూ. 70 లక్షలుగా నిర్ధారణ
  • రూ. 50 లక్షలుగా కోట్ చేసిన వ్యాపారులు
  • 2016-19 మధ్య రూ. 75 లక్షలు పలికిన ధర 
  • చందనం కొనుగోలు చేసే దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కారణం!
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చి రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప-2 సినిమా కథ మొత్తం ఎర్రచందనం చుట్టూనే తిరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి కోట్లకు కోట్లు రేటు పలుకుతున్నట్టు చూపిస్తారు. అయితే, నిజానికి దానికి అంత సీన్ లేదని తేలిపోయింది. స్మగ్లర్ల నుంచి ఏపీ యాంటీ టాస్క్‌ఫోర్స్, పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న 5,376 టన్నుల ఎర్రచందనం విక్రయానికి పెట్టగా అనుకున్నంత స్థాయిలో డిమాండ్ రాకపోవడం ఆశ్చర్యపరిచింది. 

ఈ మొత్తం చందనం దుంగల్లో కొంత మొత్తాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని గతేడాది రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నించింది. అయితే, టెండర్ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిరాశే ఎదురైంది. తాజాగా 905 టన్నులు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించినా అంతగా స్పందన రాలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఎర్ర చందనం టన్ను ధరను అటవీశాఖ రూ. 70 లక్షలుగా నిర్ణయించగా, ఎక్కువమంది వ్యాపారులు రూ . 50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. టెండర్ రేటుకు బిడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేసింది కూడా 30 శాతం సరుకే. 

2016-19 మధ్య టన్ను ఎర్రచందనం ధర రూ. 70 నుంచి రూ. 75 లక్షలు పలికింది. కానీ, ఇప్పుడు అమాంతం రూ. 20 లక్షలు తగ్గిపోయింది. అయితే, ఇందుకు చైనా, జపాన్, మలేసియా, సింగపూర్, అరబ్ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు. 
Sandalwood
Andhra Pradesh
Pushpa

More Telugu News