Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక సూచనలు చేసిన ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల

ap finance minister payyavula keshav Key suggestions in gst council meeting
  • 5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై ఒక్క శాతం ఏపీ ప్లడ్ సెస్ విధించాలన్న మంత్రి పయ్యావుల కేశవ్
  • పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలన్న పయ్యావుల 
  • ఇన్నోవేషన్ల ప్రోత్సాహకానికి గానూ రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పయ్యావుల
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం 55 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై పయ్యావుల కీలక సూచనలు చేశారు. 

5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణాపై ఒక్క శాతం ఏపీ ప్లడ్ సెస్ విధించాలని సూచించారు. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ సెస్ ద్వారా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ, పునరావాస చర్యలు చేపడతామని చెప్పారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించిన విషయాన్ని పయ్యావుల గుర్తు చేశారు. 

ఇన్నోవేషన్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలన్నారు. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, రాష్ట్రాలకు కూడా డేటా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని, అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని తెలిపారు. 

చిన్న వ్యాపారస్తులు.. కంపోజిషన్ జీఎస్టీ చెల్లింపు దారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కీలకాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవను జీఎస్టీ కౌన్సిల్లో పయ్యావుల ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి ఏం కావాలో వివరిస్తూనే .. వివిధ రంగాల్లో జీఎస్టీ కౌన్సిల్ అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి పయ్యావుల ఇచ్చిన కీ నోట్ ప్రసంగానికి ఇతర రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు ప్రశంసించారు. 

ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్.. క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తాను చేసిన సూచనలపై వెంటనే కేబినెట్ సబ్ కమిటీ వేసినందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్‌కు పయ్యావుల ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్ వెంట జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు పాల్గొన్నారు.
Payyavula Keshav
GST Council
Nirmala Sitharaman
Chandrababu

More Telugu News