KTR: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: అసెంబ్లీలో కేటీఆర్ సవాలు

I will resign if proves loan waiver is completed in any village KTR challenges
  • ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా ఇచ్చినట్టు నిరూపించాలంటూ ఛాలెంజ్
  • నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానన్న కేటీఆర్
  • 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేస్తుందన్న మాజీ మంత్రి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ‘రైతు భరోసా’ అంశంపై ఇవాళ (శనివారం) చర్చ కొనసాగుతోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ సవాలు విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాలు విసిరారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని ఆయన ప్రకటించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇతర పెద్దలకు కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదని, రెండు పంటల సాయాన్ని ఎగ్గొట్టారని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రతి రైతుకి రూ.17వేలు బాకీ పడ్డారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కలిపి రూ.26 వేల కోట్ల మేర బాకీ పడ్డారని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్‌ పాలనలో 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సభను వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామని, 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుందని కేటీఆర్ సవాలు విసిరారు. 

రైతుల బకాయిలను చెల్లించి కొత్తగా రైతు భరోసాను అందివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను పది రోజులపాటు పొడిగించాలని స్పీకర్‌ను ఆయన కోరారు. విద్యుత్, నీటి పారుదల, మిషన్‌ భగీరథ అంశాలపై చర్చ చేపట్టాలని అన్నారు.
KTR
Telangana
Telangana Assembly Session
Revanth Reddy

More Telugu News