Live-ins: సహజీవనం, స్వలింగ వివాహాలపై నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Union Minister Nitin Gadkari Sensational Comments On Live ins
  • ఇవి రెండూ సమాజ విధ్వంసానికి కారణమవుతాయన్న గడ్కరీ
  • ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను అనుమతించాల్సి వస్తుందని వ్యాఖ్య
  • పిల్లల్ని కనడం, వారిని సక్రమంగా పెంచడం తల్లిదండ్రుల విధి అన్న గడ్కరీ
సహజీవనాలు, స్వలింగ వివాహాలపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండూ తప్పుడు పద్ధతులని పేర్కొన్న మంత్రి.. వీటి వల్ల సమాజం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సమాజంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. స్వలింగ వివాహాలు సమాజ విచ్ఛిన్నానికి కారణమవుతాయన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. లివిన్ రిలేషన్లు, స్వలింగ వివాహాలను అంగీకరిస్తూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వాలు ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను అనుమతించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

ఇటీవల తాను బ్రిటిష్ పార్లమెంటును సందర్శించినప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటని యూకే ప్రధాని, ఆ దేశ విదేశాంగ మంత్రిని అడిగానని, దానికి వారు బదులిస్తూ.. దేశంలోని యువత వివాహాలపై ఆసక్తి చూపడం లేదని, బదులుగా సహజీవనాలను ఎంచుకుంటున్నారని, దేశంలో ఇదే అతిపెద్ద సమస్యగా మారిందని వారు చెప్పారని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. 

లింగ నిష్పత్తిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పెళ్లి చేసుకున్న జంటలు పిల్లల్ని కనాలని చెప్పారు. 1500 మంది స్త్రీలకు 1000 మంది పురుషులే ఉన్న స్థితికి సమాజం చేరుకున్నప్పుడు పురుషుడికి ఇద్దరు భార్యలను అనుమతించాల్సి వస్తుందని పేర్కొన్నారు. పిల్లల్ని కనడం, వారిని సరిగా పెంచడం తల్లిదండ్రుల విధి అని గడ్కరీ తెలిపారు.
Live-ins
Same Sex Marriages
Nitin Gadkari

More Telugu News