NTR Statue: హైద‌రాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపన.. స్థలం మంజూరుకు అంగీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి

Land for Installation of 100 Feet NTR Statue in Hyderabad
  • నిన్న సీఎంను క‌లిసిన టి.డి. జనార్దన్‌, నందమూరి మోహనకృష్ణ, మధుసూదనరాజు
  • విగ్రహంతో పాటు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వివ‌ర‌ణ‌
  • తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన న‌టుడు, నాయ‌కుడు ఎన్టీఆర్ అన్న రేవంత్‌రెడ్డి 
  • ఆయ‌న విగ్రహ ప్రతిష్ఠాపనకు తమ వంతు సహకారం అందిస్తామన్న ముఖ్య‌మంత్రి
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్ఠాపనకు, ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారు.

గురువారం ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌, ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు మధుసూదనరాజు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రికి జనార్దన్ వివరించారు. 

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న తమ సంకల్పాన్ని తెలియ‌జేశారు. దాంతో పాటు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించి సహకరించాలని జనార్దన్‌, నందమూరి మోహనకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. 

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని, ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.

ముఖ్యమంత్రి సానుకూల స్పందనకు ఎన్టీఆర్‌ అభిమానులందరూ సంతోషిస్తారని పేర్కొంటూ ఆయనకి ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ తరపున జనార్దన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

NTR Statue
Hyderabad
Revanth Reddy
Telangana

More Telugu News