Rama Mohan Rao Amara: ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్య‌క్తి రామమోహ‌న్ రావు అమ‌ర‌

Govt Appoints Rama Mohan Rao Amara as SBI Managing Director
  • ప్రస్తుతం ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామమోహ‌న్ రావు
  • మూడేళ్ల పాటు బ్యాంక్ ఎండీగా కొన‌సాగ‌నున్న తెలుగోడు
  • సంస్థ ప్ర‌స్తుత ఛైర్మ‌న్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే 
  • రామమోహన్ రావుకు ఎస్‌బీఐతో 29 ఏళ్ల అనుబంధం 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి తెలుగు వ్య‌క్తి రామమోహన్ రావు అమరను నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయ‌న  మూడేళ్ల పాటు బ్యాంక్ ఎండీగా కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు నోటిఫికేషన్ జారీ అయింది. 

ఇక సంస్థ ప్ర‌స్తుత ఛైర్మ‌న్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న చైర్మన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఏర్పడిన ఖాళీని రామమోహన్ రావు భర్తీ చేయనున్నారు. కాగా, ఎస్‌బీఐ బోర్డుకు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు, ఒక ఛైర్మన్ నాయకత్వం వహిస్తారు. అమరా ఎంపికతో ఎస్‌బీఐ నాలుగో ఎండీ పోస్టు భ‌ర్తీ అయింది.

ఇక ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసినట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) వెల్ల‌డించింది. చివ‌రికి ఎండీ పదవికి రామమోహన్ రావును సిఫార్సు చేసింది. 

రామమోహన్ రావుకు ఎస్‌బీఐతో 29 ఏళ్ల అనుబంధం 
రామమోహన్ రావు అమ‌ర ఒక అనుభవజ్ఞుడైన బ్యాంకర్. ఆయ‌న‌స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 29 ఏళ్ల అనుబంధాన్ని కలిగి ఉన్నారు. గతంలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్‌బీఐ కార్డ్) ఎండీ, సీఈఓగా ప‌నిచేశారు. 

అమరా 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)గా ఎస్‌బీఐలో బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయ‌న‌కు ఇండియా, విదేశాలలో క్రెడిట్, రిస్క్ మరియు అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో అపార‌మైన అనుభ‌వం, నైపుణ్యం ఉన్నాయి. 

రామమోహన్ రావు ఎస్‌బీఐకి సంబంధించి విదేశీ పోస్టింగ్‌లను కూడా నిర్వహించ‌డం జ‌రిగింది. మొదట సింగపూర్‌లో ఎస్‌బీఐ బ్రాంచీ సీఈఓగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ తరువాత చికాగో బ్రాంచ్‌కి సీఈఓగా ప‌నిచేశారు. అలాగే ఎస్‌బీఐ కాలిఫోర్నియా బ్రాంచి అధ్యక్షుడు, సీఈఓగా ఉన్నారు. 
Rama Mohan Rao Amara
SBI Managing Director
SBI

More Telugu News