Allu Arjun: శ్రీతేజ్‌ను చూసేందుకు అల్లు అర్జున్ ఎందుకు రాలేదంటే...: అల్లు అరవింద్ వివరణ

Allu Aravind clarifeis why Allu Arjun not visited hospital
  • తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజే అల్లు అర్జున్ వద్దామనుకున్నారని వెల్లడి
  • డాక్టర్లు వద్దని చెప్పడంతో ఊరుకున్నారన్న అల్లు అరవింద్
  • ఆ తర్వాత కేసు నమోదు కావడంతో రాలేకపోయారన్న అరవింద్
  • తనను వెళ్లి చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి
  • తాను కూడా ప్రభుత్వం అనుమతి తీసుకొని వచ్చానన్న అల్లు అరవింద్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడడానికి సినీ నటుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదో ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఈరోజు ఆయన కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను చూసి వచ్చారు. అనంతరం అక్కడ ఉన్న అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అరవింద్  తన కొడుకు ఎందుకు రాలేదో వెల్లడించారు.

శ్రీతేజ్‌ను పరామర్శించడానికి అల్లు అర్జున్ ఎందుకు ఆసుపత్రికి వెళ్లలేదని చాలామంది అభిమానులు, బంధువులు, మిత్రులు అడుగుతున్నారని, కానీ దానికి కారణం ఉందన్నారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజునే అల్లు అర్జున్ ఆసుపత్రికి రావాలని భావించారని, కానీ ఘటన జరిగిన మరుసటి రోజే రావడం ఎందుకని వైద్యులు చెప్పారని, వారి సూచనలు కరెక్టే అనిపించి అప్పుడు ఆగిపోయినట్లు చెప్పారు.

అంతలోనే కేసు నమోదయిందన్నారు. కేసు నమోదు కావడంతో అల్లు అర్జున్ అస్సలు ఆసుపత్రికి వెళ్లవద్దని లీగల్ టీం సూచించిందన్నారు. అలాగే శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలవడానికి కూడా వెళ్లవద్దని చెప్పిందన్నారు. ఆ తర్వాత కూడా తాము రావడానికి అనేక నిబంధనలు అడ్డు వచ్చాయన్నారు.

ప్రభుత్వ అనుమతితో వచ్చాను

కిమ్స్ ఆసుపత్రికి రావడానికి చివరకు తాను కూడా ప్రభుత్వాన్ని అనుమతి అడిగానని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని కనీసం తాను అయినా వెళ్లి పలకరిస్తానని ప్రభుత్వాన్ని కోరి... అనుమతిస్తే వచ్చానన్నారు. శ్రీతేజ్‌ను నేను చూడలేకపోతున్నానని (నిబంధనల కారణంగా) కనీసం మీరైనా వెళ్లి చూసి రమ్మని తనకు చెప్పారని, దీంతో తాను ప్రభుత్వం అనుమతితో వచ్చానన్నారు.

తనకు అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, పోలీసు శాఖకు, కిమ్స్ ఆసుపత్రి సీఈవో, మెడికల్ డైరెక్టర్, ఆసుపత్రి సిబ్బందికి అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీతేజ్ కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు

కిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో ఉన్న శ్రీతేజ్‌ను చూసి వచ్చానని, అతను రోజురోజుకు రికవరీ అవుతున్నాడన్నారు. శ్రీతేజ్ గురించి తాను డాక్టర్లతో మాట్లాడానన్నారు. 14 రోజులుగా ఆసుపత్రిలో ఉంటున్నాడని, అయితే గత 10 రోజులుగా రికవరీ కనిపిస్తోందన్నారు. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారన్నారు. శ్రీతేజ్ కోలుకోవడానికి తాము ఏం చేయడానికైనా సిద్ధమే అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమన్నారు.
Allu Arjun
Allu Aravind
Tollywood
Telangana
Hyderabad

More Telugu News