Vijay malya: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ

Rs 14000 crore returned to banks from Mallya assets sales Says FM Nirmala Sitharaman
  • లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
  • నీరవ్ మోదీ నుంచి వెయ్యి కోట్లు వసూలు చేశామన్న కేంద్ర మంత్రి
  • మిగతా ఎగవేతదారుల నుంచి మరో 7 వేల కోట్లు రాబట్టామని వెల్లడి
బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి ఈ ఏడాది రూ.22 వేల కోట్లు రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి రూ.14 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు వివరించారు. అదేవిధంగా గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి, బ్యాంకు రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులు అమ్మి వెయ్యి కోట్లు వసూలు చేశామన్నారు.

మిగతా ఎగవేతదారుల నుంచి ఏడు వేల కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ.22,280 కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని చెప్పారు. ఇందుకోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని తెలిపారు. ఎగవేతదారులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను స్పెషల్ కోర్టు ఆదేశాలతో బ్యాంకులు, ఈడీ అధికారులు విక్రయించారని వివరించారు.

మరో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ఈ ఆస్తులను కూడా వేలం వేసేందుకు స్పెషల్ కోర్టు అనుమతిచ్చిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న సుమారు 13 వేల కోట్లకు పైగా రుణాలను చోక్సీ చెల్లించలేదని తెలిపారు. దీంతో ఈడీ జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర రుణదాతలకు చెల్లించాలని ముంబై స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పీఎంఎల్ఏ చట్టం ఆధారంగా రుణాల ఎగవేతదారుల నుంచి సొమ్ము రాబడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Vijay malya
Nirav Modi
King Fisher
Lok Sabha
Nirmala Sitharaman
Assets
Banks
ED

More Telugu News