broadband connectivity: మార్చిలోపు ఏపీలోని అన్ని పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు

broadband connectivity to all panchayats in ap by march 2025
  • భార‌త్‌ నెట్‌-2 ప్రాజెక్టు పనుల ప్రగతిపై విజయవాడ బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష
  • ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్న ఏపీ ఫైబర్ నెట్ ఎండీ కె దినేశ్ కుమార్
  • డిజిటల్ పంచాయతీల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్న దినేశ్ కుమార్ 
రాష్ట్రంలో డిజిటల్ భారత్ నిధులతో చేపడుతున్న భార‌త్‌ నెట్‌-2 ప్రాజెక్టు పనుల ప్రగతిపై మంగళవారం విజయవాడలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరిగింది. రాష్ట్రంలో భారత్ నెట్ ప్రాజెక్టు పనుల ప్రగతి గురించి వివరించిన ఏపీ ఫైబర్ నెట్ ఎండీ కె. దినేష్ కుమార్.. 2025 మార్చి నెలాఖ‌రులోపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సేవల సదుపాయం కల్పిస్తామని భారత్ డిజిటల్ నిధి అధికారులకు తెలిపారు. ఈ మేరకు పనులు వేగవంతంగా చేపడుతున్నామని చెప్పారు. 

భారత్ నెట్ పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని 15 వేల మందికి ఫైబర్ నెట్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పించామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖ‌రులోపు మరో 11,254 పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. భార‌త్‌ నెట్‌ 2 పథకం కింద అన్ని పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్‌ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని తెలిపారు. డిజిటల్ పంచాయతీల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

డిజిటల్ భారత్ నిధి డిప్యూటీ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో భార‌త్‌ నెట్‌ -2 ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. నిర్దిష్ట లక్ష్యాల మేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, దానికి అవ‌స‌ర‌మైన సహకారం తాము అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిజిటల్ భారత్ నిధి డైరెక్టర్ హ‌రికృష్ణ‌న్ తదితరులు పాల్గొన్నారు.
broadband connectivity
panchayats
Andhra Pradesh
Bharat Net

More Telugu News