Sports News: భారత్‌కు తప్పిన ఫాలో-ఆన్ గండం.. గబ్బా టెస్ట్‌లో ముగిసిన నాలుగవ రోజు ఆట

India avoids follow on in Gabba Test and 4th day comleted
  • నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 252/9
  • ఇంకో 193 పరుగులు వెనుకబడిన టీమిండియా
  • రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా
  • మరోసారి దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగవ రోజు ఆట పూర్తయింది. ఓవర్ నైట్ స్కోరు 51/4‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్... ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన నాలుగవ రోజున భారత్ 201 పరుగులు మాత్రమే జోడించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకో 193 పరుగులు వెనుకబడి ఉంది. కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77 పరుగులతో రాణించడంతో భారత్ ఫాలో-ఆన్ గండాన్ని తప్పించుకుంది.

ఆట ముగిసే సమయానికి జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ క్రీజులో ఉన్నారు. చివరి వికెట్‌కు వీరిద్దరూ 39 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆకాశ్ దీప్ 27, బుమ్రా 10 పరుగులతో ఆసీస్ బౌలర్లకు చివరిలో చిరాకు తెప్పించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక భారీ సిక్సర్ బాదడం విశేషం.

ఇక భారత బ్యాటర్లలో  యశస్వి జైస్వాల్ 4, కేఎల్ రాహుల్ 84, శుభ్‌మాన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 3, రిషబ్ పంత్ 9, రోహిత్ శర్మ 10, రవీంద్ర జడేజా 77, నితీశ్ కుమార్ రెడ్డి 16, మహ్మద్ సిరాజ్ 1, జస్ప్రీత్ బుమ్రా 10 (బ్యాటింగ్) ఆకాశ్ దీప్ 27(బ్యాటింగ్) పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3, జాస్ హేజెల్‌వుడ్, నాథన్ లియోన్ చెరో వికెట్ తీశారు.
Sports News
Cricket
India Vs Australia
Team India

More Telugu News