Manda Krishna Madiga: బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వాలి: మంద కృష్ణ

Manda Krishna visits KIMS Hospital and talked to injured boy
  • పుష్ప-2 ప్రీమియర్స్ వేళ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట
  • రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
  • కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడ్ని పరామర్శించిన మంద కృష్ణ
పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతుండడం తెలిసిందే. 

ఈ క్రమంలో నేడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతోనూ, కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లతోనూ మంద కృష్ణ మాట్లాడారు. బాలుడికి అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా, మంద కృష్ణ స్పందిస్తూ... బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ రూ.1 కోటి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ బాలుడి సోదరి చదువులకు అయ్యే ఖర్చులు కూడా అల్లు అర్జున్ భరించాలని అన్నారు. మా అసోసియేషన్, ఇతర సినీ ప్రముఖులు కూడా మృతి చెందిన మహిళ కుటుంబానికి చేయూతనివ్వాలని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట నివారించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంద కృష్ణ పేర్కొన్నారు. 

కాగా, తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడ్ని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు, నేతలు ఎవరూ రాకపోవడం బాధాకరమని అన్నారు.
Manda Krishna Madiga
Allu Arjun
Sandhya Theater Incident
Hyderabad
MRPS
Tollywood

More Telugu News