Gabba Test: గబ్బా టెస్ట్.. పట్టు సాధిస్తున్న ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ సెంచరీ

Travis Head ton Australia helps hit back after early strikes
  • గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్
  • 115 బంతుల్లో సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్
  • భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని ది గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగుస్తోంది. నిన్న తొలి రోజు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 25 నిమిషాలు మాత్రమే ఆట కొనసాగగా ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. నేడు రెండోరోజు ఆట ప్రారంభం కాగా, వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మాత్రం ఆసీస్ ఆటగాళ్లు వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయారు. 

మాజీ సారథి స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ భారత బౌలర్ల సహనాన్నిపరీక్షిస్తూ స్కోరు బోర్డులో పరుగులు పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ 115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో హెడ్‌కు ఇది 9వ శతకం. మరోవైపు, స్టీవ్ కూడా అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. స్టీవ్ 65, హెడ్ 112 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఉస్మాన్ ఖావాజా 21, నాథన్ మెక్‌స్వీనీ 9, లబుషేన్ 12 పరుగులు చేశారు. బుమ్రా రెండు, నితీశ్‌కుమార్‌రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు. 
Gabba Test
Team India
Team Australia
Travis Head

More Telugu News