NTR Diamond Jubille: ఎన్టీఆర్ ను చరిత్ర మర్చిపోదు: వెంకయ్యనాయుడు

 Venkaiah Naidu speech in NTR Diamond Jubille celebrations
  • ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో వెంకయ్యనాయుడు ప్రసంగం
  • ఎన్టీఆర్ కారణజన్ముడు అని కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి
  • ఎన్టీఆర్ లో మూడు గుణాలు తనకు బాగా నచ్చుతాయని వెల్లడి
ఎన్టీఆర్ కారణజన్ముడు అని, ఆయన వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇవాళ కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ లో తనకు అన్నిటికంటే బాగా నచ్చేది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అని వెల్లడించారు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వస్తారని, ఈ మూడింటిని అలవర్చుకోవడమే మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

"ఎన్టీ రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినవారు. ఆయనకు క్యారెక్టర్, కాలిబర్, కెపాసిటీ, కాండక్ట్... ఇవన్నీ ఆయనకు నిండుగా, మెండుగా ఉన్నాయి. లోతుగా గమనిస్తే ఆయన సినిమాల్లోని మాటల్లో, పాటల్లో ఒక సందేశం ఉంటుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా సినీ చరిత్రలో ఎన్టీఆర్ గారి స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయన ఏకాగ్రత అమోఘం. ఏదైనా ఒకటి అనుకుంటే పూర్తయ్యేదాకా విశ్రమించరు. కొన్ని పాత్రల కోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించేవారు. అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెల్లింది. 

కథానాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగానూ తన నటనా వైదుష్యాన్ని చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకు ఉదాహరణ రాముడి పాత్ర, రావణుడి పాత్ర. రావణబ్రహ్మలోని విశేషాలన్నింటినీ ఎన్టీఆర్ తన నటన ద్వారా చూపించారు. అలాగే శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు, ధుర్యోధనుడి పాత్ర పోషించారు... ఆయనకు ధుర్యోధనుడు అనడం ఇష్టం ఉండదు... సుయోధనుడు అంటుంటారు. ధుర్యోధనుడిలోని మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా బయటికి తీసుకువచ్చారు. 

ఎన్టీ రామారావు స్ఫురద్రూపి, అందగాడు. ఎంతో ఆకర్షణీయంగా, ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపించే రూపం ఆయనది. ఆ అదృష్టం అందరికీ రాదు... వేషం వేసినా, వేషం వేయకపోయినా రామారావు రామారావే... ఆయనకు ఆయనే సాటి. సినీ నటులకు బిరుదులు ఇవ్వడం సాధారణ విషయం. అభిమానులు తమ ఆరాధ్య నటులను పొగుడుకుంటారు. ఎన్టీఆర్ ను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటారు... ఆయన నటన ప్రపంచవ్యాపితం... ఇది వాస్తవం. తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. 

డైలాగులతో ఆయన చేసే స్వర విన్యాసం, హావభావాలతో చేసే నట విన్యాసం... ఈ రెండు కూడా అద్భుతమైనవి. ఎవరూ ఇష్టపడని బృహన్నల పాత్రను అద్భుతంగా పోషించారు. అదే సమయంలో అర్జునుడిగానూ నటించారు. శ్రీకృష్ణుడిగా, ధుర్యోధనుడిగా... ఇలా ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రలో అలా నిలిచిపోయారు.

ఓసారి ఆచార్య రంగా గారు ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన తన సేవకుడిని ఓటేసి రమ్మని పంపారట. హస్తం గుర్తుపై ఓటేసి రమ్మని చెప్పాడట... కానీ ఓటేసి వచ్చిన తర్వాత అతను నక్కి నక్కి నడుస్తున్నాడట. చెయ్యి గుర్తుకు ఓటు వేశావా అని అడిగితే... ఆ గుర్తుకే ఓటు వేయబోతే... సైకిల్ గుర్తుకు ఉన్న చక్రంలో శ్రీకృష్ణుడు కనిపించి సైకిల్ కు ఓటేయమని చెప్పాడయ్యా... సైకిల్ కు వేశాను అని ఆ సేవకుడు చెప్పాడట. అంటే... శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు... శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని రామారావు రూపం ప్రజల్లోకి వెళ్లిపోయింది. దానికి కారణం ఆయన ప్రదర్శించిన నటనా కౌశలం. 

ఇవాళ ఆయన వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. గ్రామాల్లో ఎన్టీవోడు అని పిలుచుకునేవారు. పౌరాణిక పాత్రల్లో పరకాయప్రవేశం చేశారు. చిన్న వయసులోనే భీష్ముడి పాత్ర పోషించారు. అంతేకాదు, తాను మెచ్చిన మహనీయుల పాత్రలను అందంగా చెక్కి మనముందుంచే ప్రయత్నం చేశారు. శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రంలో నటించి మెప్పించారు. శ్రీనాథుడి పేరుతో సినిమా తీయడం అంత సులభం కాదు. చరిత్రలో తనకు నచ్చిన పాత్రల్లో నటించి మెప్పించడం ఆయనకే చెల్లింది. 

ఆయనకు తెలుగు భాషపై ఉండే అభిమానం నాకు బాగా నచ్చుతుంది. ఆయన తాను స్థాపించిన పార్టీకి కూడా తెలుగుదేశం అని పెట్టుకున్నారు. అప్పట్లో అందరూ... తెలుగుదేశం ఏంటని ఆశ్చర్యపోయారు. అప్పట్లో నన్ను అడిగారు... మీరు తెలుగుదేశంలో చేరతారా అని... లేదయ్యా, నేను భారతదేశంలోనే ఉంటాను అని చెప్పాను. కానీ పార్టీ పెట్టి కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మొట్టమొదటగా ఓడించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ పేరిట ఢిల్లీలోనూ కాంగ్రెస్ పెత్తనాన్ని సవాల్ చేశారు. 

వెనుకబడిన వర్గాలను కూడా ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ కారణంగా ఒక తరం వారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. రామారావుకు ఆడపడుచులపై అభిమానం ఉండేది. అందుకే వారికి ఆస్తి హక్కు కల్పించారు... ఈ విషయాన్ని చరిత్ర మర్చిపోదు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఆయన ఘనతే. అంతేకాదు, అవినీతిపరుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచారు. అక్రమార్కుల పాలిట ఆయన చండశాసనుడు. 

ఒకరకంగా చెప్పాలంటే ఆయన తక్కువ వయసులోనే అర్ధంతరంగా వెళ్లిపోయినట్టు భావించాలి. ఇది తెలుగు ప్రజలకు తీరనిలోటు. ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలి. అందులో ఎలాంటి తప్పులేదు... దీన్ని రాజకీయంగా ఎవరూ తప్పుబట్టే అవకాశం లేదు. రామారావు రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు" అని వెంకయ్యనాయుడు వివరించారు.
NTR Diamond Jubille
Venkaiah Naidu
NTR
Andhra Pradesh

More Telugu News