Puspha 2: అల్లు అర్జున్ అరెస్టైన రోజు పుష్ప-2 కలెక్షన్లు ఎంతంటే?

Puspha2 collects a whopping Rs 36 crore net on Allu Arjun Arrest day
  • 9వ రోజున రూ.36.25 కోట్లు వసూలు చేసిన పుష్ప-2
  • హిందీలో మతిపోయే రేంజ్‌లో కలెక్షన్లు
  • దేశవ్యాప్తంగా రూ.762, ప్రపంచవ్యాప్తంగా రూ.1067 కోట్లు రాబట్టిన పుష్పరాజ్
  • వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే ఛాన్స్
పుష్ప-2 విజయానందంలో ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం రాత్రి ఆయన చంచల్‌గూడ జైలులో గడిపారు. సరిగ్గా ఇదే రోజు.. అంటే పుష్ప-2 విడుదలైన 9వ రోజైన శుక్రవారం ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.36.25 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా హవా కొనసాగుతోంది.

సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ కథనం ప్రకారం.. ఈ మూవీ శుక్రవారం హిందీ వెర్షన్‌లో రూ.27 కోట్లు, తెలుగు వెర్షన్‌లో రూ.7.5 కోట్లు, తమిళంలో రూ.1.35 కోట్లు, కన్నడ, మలయాళంలో రూ.0.2 కోట్లు రాబట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.762.1 కోట్లకుపైగా రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.1067 కోట్లు రాబట్టింది. 

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్లను అధిగమించేందుకు పుష్ప-2 సమీపిస్తోందని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్‌ అయిన శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్‌తో పాటు పలువురు అగ్రనటులు నటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత వేగంగా రూ.1000కోట్ల వసూళ్ల మైలురాయి చేరుకున్న సినిమాగా పుష్ప-2 నిలిచిన విషయం తెలిసిందే.
Puspha 2
Allu Arjun
Allu Arjun Arrest
Tollywood
Movie News

More Telugu News