Nizamabad District: నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత మామపై కేసు.. కారణం ఇదే

Police have registered a case against uncle of BRAS MLC Kavitha in Nizamabad
  • భూకబ్జాకు పాల్పడుతున్నారంటూ మైనంపల్లి హన్మంత రావు బంధువు ఫిర్యాదు
  • కిషన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న స్థలం విషయంలో వివాదం
  • అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదు ఆధారంగా మరో కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్‌హెచ్‌వో మహమ్మద్‌ ఆరీఫ్‌ వెల్లడించారు.  

కాగా, ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారంటూ సదరు అపార్ట్‌మెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తమను కులం పేరుతో దూషించారని, అంతు చూస్తానంటూ కిషన్ రావు అనుచరులు బెదిరించి దాడికి పాల్పడ్డారని వివరించారు. దీంతో రామ్‌కిషన్‌ రావు, మాజీ కార్పొరేటర్‌ భర్త సుదామ్‌ రామ్‌చంద్, నగేశ్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.

ఇదిలావుంచితే, ఇదే స్థలం తమదంటూ మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ వాదిస్తున్నారు. తాము రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ తమపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేశ్‌ కుమార్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ స్థలంతో రామ్‌కిషన్‌ రావుకు అసలు సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నగేశ్‌ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ కిషన్ రావు, అపార్ట్‌మెంట్‌ వాసి గోపితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Nizamabad District
BRS
K Kavitha

More Telugu News