Supreme Court: అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government filed an affidavit in the supreme court saying amaravathi is the only capital
  • రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం సంపూర్ణ అబివృద్ధికి నిర్ణయం తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం
  • కోర్టు ముందున్న ఎస్ఎల్‌పీపై విచారణ ముగించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
  • హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సుప్రీం కోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో పాటు, అమరావతి రాజధానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పేర్కొంటూ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా రాజధానిలో అభివృద్ధి పనులు మొదలు పెట్టింది. 

రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ గురువారం (నేడు) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 16 పేజీల అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాజధాని మాస్టర్ ప్లాన్, భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపింది. రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. 

రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సుప్రీం కోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కోర్టు ముందున్న ఎస్ఎల్‌పీపై విచారణ ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.  
Supreme Court
amaravathi
AP Government
ap capiital issue

More Telugu News