Telangana: తెలంగాణ తల్లి తలపై కిరీటం ఎందుకు పెట్టలేదో చెప్పిన అందెశ్రీ

Andesri reveals why Telangana Thalli did not have Bathukamma on her head
  • మానవ రూపానికి... అమ్మ రూపానికి కిరీటం ఉంటుందా? అని ప్రశ్న
  • బతుకమ్మ తానే అయినప్పుడు ఆమె బతుకమ్మను ఎత్తుకుంటుందా? అన్న అందెశ్రీ
  • అమ్మ దీవిస్తున్నట్లుగా చేతిని తీర్చిదిద్దారన్న అందెశ్రీ
దేవత రూపానికైతే కిరీటం ఉంటుందని, కానీ అమ్మరూపానికి ఉంటుందా? అని ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో బతుకమ్మతో పాటు కిరీటం లేకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కిరీటం లేకపోవడంపై ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అందెశ్రీ స్పందించారు. బాసర సరస్వతీమాతను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.

తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలంటే... భూమి మీద పురుడు పోసుకున్న ఏ తల్లికి కిరీటం ఉంటుందో చెప్పాలన్నారు. కిరీటాలు పెట్టుకుంటే అలాంటి అమ్మవారిని గుళ్లలో పెట్టుకొని పూజిస్తామని, కానీ మానవదేహం కలిగిన తల్లికి కిరీటం ఎందుకన్నారు. 

బతుకమ్మ అంటేనే తెలంగాణ తల్లి అని... కాబట్టి ఈ అమ్మ తన బతుకమ్మను తానే మోసుకుంటుందా? అని ప్రశ్నించారు. బతుకమ్మను మోసేది మనుషులు అని గుర్తించాలన్నారు.

తెలంగాణ తల్లి మన అమ్మలకు ప్రతి రూపమని... మానవ రూపానికి ప్రతిరూపమని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి అలా తయారు చేయించారన్నారు.

ఈ తెలంగాణ తల్లి స్వయంగా బతుకమ్మ కాబట్టి తనను తాను ఎత్తుకోలేదని, అలాగే మానవరూపం ధరించారు కాబట్టి కిరీటం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పరిపూర్ణమైన మట్టి తల్లికి... మనిషి తల్లికి... మన అమ్మరూపాలకు... మన తోబుట్టువులకు... మొత్తం తెలంగాణ తల్లి అస్థిత్వానికి... పచ్చదనానికి పట్టాభిషేకమన్నారు. ఈ తెలంగాణ తల్లి దేవత అని... అందుకే దీవిస్తున్నట్లుగా చేతిని రూపొందించారన్నారు.
Telangana
Bathukamma
Andesri
Congress

More Telugu News