Pushpa: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా దుర్ఘటన... హైకోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ యజమాని

Sandhya theatre owner petition in High Court
  • పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట
  • తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి
  • థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • రేవతి మృతితో తమకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ థియేటర్ యజమాని రేణుకా దేవి ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో ఈ దుర్ఘటన జరిగినట్టు కథనాలు వచ్చాయి. ఈ ప్రమాదంపై రేవతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో థియేటర్ యజమాని హైకోర్టుకు వెళ్లారు.

రేవతి మృతితో తమకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పుష్ప-2 సినిమాకు తాము ప్రీమియర్ షోలు నిర్వహించలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లే నేరుగా సినిమాను నడిపించుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ తమవంతుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కానీ తమపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఇది అన్యాయమని అందులో పేర్కొన్నారు.
Pushpa
Hyderabad
Tollywood
Telangana

More Telugu News