Harish Rao: మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao blames Revanth Reddy for food poision
  • ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస విద్యార్థులపై లేదని మండిపాటు
  • సొంత జిల్లాల్లోని స్కూల్స్, గురుకులాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శ
  • విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీత
సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస... విద్యార్థుల భవిష్యత్తుపై లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదన్నారు. కనీసం సొంత జిల్లాలోని ప్రభుత్వ స్కూల్స్, గురుకులాలను కూడా సీఎం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నప్పటికీ... విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరుతో ఇంకెంత మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి? ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని ప్రశ్నించారు.
Harish Rao
Telangana
BRS
Revanth Reddy

More Telugu News