Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు

third Test for Rohit Sharma dismissed in single digits in both innings in a calendar year
  • అడిలైడ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిటల్ స్కోర్లకే ఔట్
  • ఒకే క్యాలెండర్ ఏడాదిలో ఇలా మూడు సార్లు ఔటైన కెప్టెన్‌గా అవాంఛిత రికార్డు
  • సనత్ జయసూర్య సరసన చేరిన హిట్‌మ్యాన్
టెస్టు ఫార్మాట్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో హిట్‌మ్యాన్ అందుబాటులో లేడు. అయితే అడిలైడ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ స్కోర్‌లకే వెనుదిరిగాడు. 

రెండవ ఇన్నింగ్స్‌లో 15 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే సాధించి ఔట్ అయ్యాడు. రెండవ రోజు ఆట ఆఖరి సెషన్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్స్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేశారు. బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి నేరుగా ఫీల్డర్‌ చేతుల్లోకి వెళ్లింది. దీంతో కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ చక్కటి బంతితో రోహిత్ శర్మను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.

అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమవ్వడంతో రోహిత్ శర్మ పేరిట అవాంఛిత రికార్డు నమోదయింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ పరుగుకే ఔట్ కావడం రోహిత్‌ శర్మకు ఇది మూడో టెస్ట్‌ మ్యాచ్.  ఒక క్యాలెండర్ ఏడాదిలో మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఈ విధంగా ఔటైన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు కేవలం ఇద్దరు కెప్టెన్లు మాత్రమే ఈ చెత్త ప్రదర్శనను నమోదు చేశారు.  శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య, బంగ్లాదేశ్ ఆటగాడు మోమినుల్ హక్ ఈ జాబితాలో ఉన్నారు. 2001లో జయసూర్య, 2022లో మోమినుల్ ఇద్దరూ చెరో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచారు. కాగా అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్ర కష్టాల్లో పడిన విషయం తెలిసిందే.
Rohit Sharma
Sports News
Cricket
India vs Australia

More Telugu News