Quasi moon: భూమికి కొత్త చంద్రుడు... దానికి పేరు సూచిస్తారా?

vote on seven names for earths quasi moon
  • భూమికి సమీపంలో సంచరించే ఓ ఆస్టరాయిడ్
  • చందమామలా కాకున్నా... ఏటా రెండు సార్లు భూమిని చుట్టేసే తీరు
  • దానికి పేరు ఎంపిక చేయాలంటూ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ (ఐఏయూ) పిలుపు
భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయని ఎవరైనా అడిగితే... ఎన్ని ఏంటి? ఒకటే... మన చందమామ ఒక్కడే అంటారు కదా. ఇది సగమే నిజం. ఎందుకంటే మన భూమికి ప్రధాన ఉపగ్రహం చంద్రుడు ఒక్కడే అయినా... మరికొన్ని ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని క్వాసీ మూన్స్ గా పిలుస్తుంటారు. అంటే అవి చంద్రుడిలా భూమి చుట్టూ తిరగకపోయినా... భూమికి సమీపంలోనే సంచరిస్తూ, నిర్దారిత సమయంలో భూమిని చుట్టేస్తూ ఉంటాయి. అలాంటి ఓ క్వాసీ మూన్ కు పేరును ఎంపిక చేయాలంటూ ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ (ఐఏయూ)’ పిలుపును ఇచ్చింది.

ఏమిటా క్వాసీ మూన్?
భూమి వెంట ఉంటూ సూర్యుడిని చుట్టేస్తున్న ఓ గ్రహ శకలాన్ని శాస్త్రవేత్తలు 2004లో గుర్తించారు. సుమారు 160 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ కు ‘2004 జీయూ9’గా పేరుపెట్టారు. ఇది దాదాపుగా భూమి పరిభ్రమించే వేగంతోనే కదులుతూ... సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో ఏటా రెండు సార్లు భూమి కక్ష్యను దాటుతుంది. ఈ క్రమంలో భూమి చుట్టూ కూడా పరిభ్రమించినట్టు అవుతుంది. అలా భూమి వెంటే ఉంటుంది కాబట్టి దీన్ని క్వాసీ మూన్ గా గుర్తించారు.

మరో 600 ఏళ్లు మనతో... తర్వాత అంతరిక్షంలోకి...
సాధారణంగా గ్రహ శకలాలు భూమికి దగ్గరగా రావడం, వెళ్లిపోవడం సాధారణమే. అలాగే ఈ క్వాసీ మూన్ కూడా శాశ్వతంగా భూమి చుట్టూ తిరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ప్రస్తుత కక్ష్య ప్రకారం... సుమారు 2600వ సంవత్సరం వరకు భూమికి సమీపంగా సంచరించి... ఆ తర్వాత అంతరిక్షంలోకి దూరంగా వెళ్లిపోతుందని తేల్చారు.

ఇప్పుడు పేరెందుకు?
2004లోనే దీన్ని గుర్తించినా, మరో 600 ఏళ్లు మన వెంట ఉంటుంది కాబట్టి... దానికి ఒక పేరు పెడదామని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇలా ఖగోళ వస్తువులకు ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్’ పేరును ఖరారు చేస్తుంది. ఇందుకోసం ప్రజల నుంచి పేర్లను ఆహ్వానించింది. అందులో నుంచి ఏడు పేర్లను ఫైనల్ లిస్టుగా ఎంపిక చేసింది. ఈ ఏడు పేర్లలో నుంచి ఒకదానికి ఓటేయాలంటూ... తాజాగా ప్రకటించింది.

ఏమిటా ఏడు పేర్లు...? ఎలా ఓటేయాలి?
బకునవా – ఫిలిప్పీన్స్ జానపద గాథల్లోని ఓ డ్రాగన్ పేరు. జానపద కథలో అది సముద్రంలోంచి పైకి వచ్చి చంద్రుడిని మింగేస్తుంది.
కార్డియా – రోమన్ దేవత పేరు
ఎహెమా – ఎస్తోనియన్ జానపద గాథల్లోని సంధ్యా సమయ దేవత
ఎన్ కిడు – సుమేరియన్ జానపద కథల్లోని చక్రవర్తి స్నేహితుడి పేరు
ఓటర్ – నార్స్ జానపద గాథల్లో కావాలనుకున్నట్టుగా ఆకారాలను మార్చే పాత్ర పేరు.
టరియాక్సుక్ – ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇన్యూట్ తెగ ఇతిహాసాల్లోని పాత్ర పేరు
టెక్కిజటెకటల్ – ఆజ్ టెక్ ఇతిహాసాల్లోని చంద్రదేవుడి పేరు ఇది.

మరి వీటిలో దేనికి మీరు ఏది బాగుందనుకుంటున్నారో... క్రింద క్లిక్ చేసి ఓటు వేయవచ్చు. జనవరి ఒకటో తేదీ దాకా టైముంది.
https://radiolab.org/quasi-moon
Quasi moon
Science
offbeat
moon
Space

More Telugu News